పాక్ కు ఐరోపా దేశాల మ‌ద్ద‌తుపై జైశంకర్ ఆగ్రహం

పాక్ కు ఐరోపా దేశాల మ‌ద్ద‌తుపై జైశంకర్ ఆగ్రహం

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ విషయంలో ఐరోపా దేశాలు అనుసరిస్తున్న వైఖరిని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. పాకిస్థాన్‌లో సైనిక పాలన కొనసాగుతున్నప్పటికీ, సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నప్పటికీ కొన్ని పశ్చిమ దేశాలు పాక్‌కు మద్దతుగా నిలవడాన్ని ఆయన తప్పుబట్టారు. 

జర్మని పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశానికి చెందిన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉందని గుర్తుచేశారు. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగిన ఐరోపా దేశాలు, పాకిస్థాన్‌లోని సైనిక పాలకులకు అండగా నిలిచాయని విమర్శించారు. 

పశ్చిమ దేశాల నుంచి లభించినంత మద్దతు పాకిస్థాన్‌కు మరెక్కడి నుంచీ రాలేదని ఆయన గుర్తు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని భారత్ అనేకసార్లు ఐరోపా దేశాల దృష్టికి తీసుకెళ్లింది. అయినప్పటికీ, 2004లో అమెరికా పాకిస్థాన్‌ను తమ ప్రధాన నాటోయేతర మిత్రదేశంగా గుర్తించింది.  ఈ గుర్తింపు ద్వారా కీలకమైన వ్యూహాత్మక భాగస్వాములకు సైనిక, ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని, ఉగ్రవాదంపై తాము చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అప్పట్లో తన చర్యను సమర్థించుకుంది. అయితే, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. 

ఈ పరిణామాలన్నింటినీ ఉద్దేశించే జైశంకర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా జైశంకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి పాకిస్థాన్‌కు తెలియదనే వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని ఆయన ఆరోపించారు.