
విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిదింతులు సిరాజ్, సమీర్‌లను న్యాయస్థానం ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. విశాఖ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సిరాజ్, సమీర్‌లను మరింత లోతుగా విచారించేందుకు విజయనగరం రెండో పట్టణ పోలీసులు కస్టడీ కోరుతూ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులతో సోమవారం కోర్టు పరిశీలనకు రాకపోగా, మంగళవారం వాదనలు విన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పుని రిజర్వు చేశారు.
బుధవారం కూడా తీర్పు వెలువరించకపోవటంతో పోలీసులు నిరాశతో వెనుదిరిగారు. ఎట్టకేలకు ఈరోజు సిరాజ్, సమీర్లను విచారణ నిమిత్తం 7 రోజుల కస్టడీకి ఇస్తూ విజయనగరం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పోలీసులకు అనుమతిచ్చారు. దీంతో విజయనగరంలోనే మకాం వేసిన ఎన్ఐఏ అధికారులు విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, సికింద్రాబాద్ బోయనగూడకు చెందిన సయ్యద్ సమీర్ కార్యాకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
ఇప్పటికే విజయనగరం రెండో పట్టణ పోలీసుల సహకారంతో ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించిన ఎన్ఐఏ అధికారులు సిరాజ్ సమీప బంధువులు, కుటుంబ సభ్యులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలతో పాటు, సిరాజ్ వినియోగించిన చరవాణీ ఆధారంగా వినియోగించిన నంబర్లు, ఎవరెవరితో మాట్లాడారాన్న విషయాలపైనా పక్క సమాచారాన్ని సేకరించారు.
సిరాజ్ కుటుంబం నివాసం ఉండే అబాద్ వీధి, సిరాజ్ ప్రత్యేకంగా ఉన్న బాబామెట్టా డబుల్ కాలనీలోని ఇంటినీ మరోసారి పరిశీలించారు. అదేవిధంగా ఆర్థిక మూలాలనూ శోధించారు. విజయనగరంలోని డీసీసీబీ బ్యాంకులో సిరాజ్ పేరిట పొదుపు, డిపాజిట్ ఖాతాల్లో రూ.52 లక్షలు ఉన్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు ఖాతాల్లో జమ తప్ప, విత్ డ్రాలు లేకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అదికూడా విడతల వారీగా రూ.70, 80వేలు చొప్పున పలుమార్లు జమైనట్లు పసిగట్టారు. ఈ మొత్తాలను కుటుంబ సభ్యలే జమ చేశారా? ఇతరులెవరైనా వేశారా? అనే కోణంలోనూ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు