రన్యా రావు కేసులో హోంమంత్రి విద్యాసంస్థలో ఈడీ సోదాలు

రన్యా రావు కేసులో హోంమంత్రి విద్యాసంస్థలో ఈడీ సోదాలు
బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు షాకిచ్చారు. మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో సోదాలు చేపట్టారు.

రన్యారావు కేసులో మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాన్యా రావుకు, మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కళాశాలలో తనిఖీలు చేపట్టారు.  కాలేజీకి సంబంధించిన పలు రికార్డులు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.

ఈడీ సోదాలు చేపట్టిన సమయంలో మంత్రి పరమేశ్వర కాలేజీలో లేరని తెలిసింది. తన అనుచరులతో వేరే ప్రాంతంలో సమావేశమైనట్లు సంబంధిత వర్గాల సమాచారం.కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్‌ కేసులో డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదే కేసులో తరుణ్‌ రాజ్‌, సాహిల్‌ సకారియా జైన్‌లను కూడా అ ధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు. ఈ క్రమంలో నిన్న రన్యారావుకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమెతో పాటు తరుణ్ రాజ్‌ కొండూరుకూడా బెంగళూరు కోర్టు మంగళవారం డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది.