
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 27 మావోయిస్టులు మృతి చెందగా, వీరిలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు(70) మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ జాబితాలో `మోస్ట్ వాంటెడ్’ తీవ్రవాదిగా పేరున్న, ఆచూకీ తెలిపిన వారికి రూ 1 బహుమతి ప్రకటించిన బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో కేశవరావుతోపాటు మరికొందరు కీలక నేతలు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి అయిన నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు.
2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి ఘటనకు నంబాల సూత్రధారి. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో కేశవరావు దిట్ట. ఐఈడీల వినియోగంలోనూ ఆయన నిపుణుడు. తూర్పు గోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా నంబాల కేశవరావు పనిచేశారు.
1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. సెప్టెంబర్ 23, 2018లో అరకు టిడిపి ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యల సూత్రధారి బసవరాజు అని భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తృతంగా పనిచేశారు. బలిమెలలో భద్రత బలగాలపై దాడిలో నంబాల కీలక సూత్రధారి. 2013లో జీరాం ఘాటిలో 27 మంది, అందులో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నాయకుడు నంద కుమార్ పటేల్ హత్యలు ఆయన ప్రణాళికలో భాగంగానే జరిగాయని భావిస్తున్నారు.
మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డి ఆర్ జి బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడం వల్ల భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. 50 గంటలుగా సాగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు చత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ వర్మ తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టం చేశారు. స్వల్ప విరామం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బస్తర్‌లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు