అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్ అరెస్ట్‌

అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలీఖాన్ అరెస్ట్‌

* ఆపరేషన్‌ సింధూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలతో

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిన అశోకా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మూదాబాద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హర్యానాలోని సోనీపట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలీఖాన్‌ను ఢిల్లీలో అరెస్టు చేసినట్లు సోనీపట్ ఏసీపీ రాయ్ అజీత్ సింగ్ తెలిపారు.

 
యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతిగా అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా మీడియా బ్రీపింగ్‌లో పాల్గొన్న కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లను ప్రొఫెసర్‌ తప్పుపట్టారు. సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్‌ ఇద్దరూ జరిగింది జరిగినట్టుగా మీడియాకు చెప్పలేదని, దేశ ప్రజలు కోరుకున్నది చెప్పారని ఆరోపించారు. 
 
ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్ర స్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలని, లేకపోతే అది వంచనే అంటూ విమర్శించారు.  అయితే, ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. అదే రోజున తమ ఎదుట హాజరు కావాలని మే 12న హర్యానా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేణు భాటియా సుమోటోగా ఈ కేసు చేపట్టి ఆయనకు నోటీసులు జారీ చేశారు.
 
కాగా, తన వ్యాఖ్యలకు రాష్ట్ర మహిళా కమిషన్ వక్రభాష్యం చెప్పిందని ప్రొఫెసర్‌ ఆరోపించారు. మహిళా కమిషన్ తన వ్యాఖ్యలను తప్పుడు తప్పుడు ఉద్దేశంతో చదివిందని, తప్పుగా అర్థం చేసుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. తన మాటల్లోని అర్థాన్ని మార్చేందుకు ప్రయత్నించిందని సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీజేపీ యువమోర్చ నేత యోగేష్ జాతరి, జాతేది గ్రామ సర్పంచ్ వాంగ్మూలాన్ని సైతం పోలీసులు నమోదు చేసి తాజాగా అరెస్టు చేశారు. 
వారిద్దరి ఫిర్యాదులపై రెండు ఎఫ్ఐఆర్ లను  నమోదు చేసినట్లు క్రైమ్ డిసిపి నరేందర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారంపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ప్రొఫెసర్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటితో యూనివర్సిటీకి సంబంధం లేదని తెలిపింది. భారత సైన్యాన్ని చూసి యూనివర్సిటీతో పాటు అందరూ గర్విస్తున్నారని పేర్కొంది. జాతీయ భద్రత కోసం సైన్యం ఎలాంటి ఆపరేషన్లు చేపట్టినా అండగా ఉంటామని స్పష్టం చేసింది.