
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్, రాష్ట్రపతి తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఏప్రిల్ 8న సంచలనాత్మక తీర్పునిచ్చింది. గవర్నర్ పరిశీలనకు పంపిన బిల్లులను మూడు నెలల్లోగా రాష్ట్రపతి ఆమోదించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్రపతికే గడువు విధించవచ్చా అంటూ సుప్రీంకోర్టుకే పలు ప్రశ్నల్ని సంధించారు.
అయితే బిల్లులకు సంబంధించి రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ ఇచ్చిన తీర్పు గతంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఇవ్వడం జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, 2016లో రాష్ట్రపతికి మూడు నెలల కాలపరిమితిని నిర్ణయిస్తూ జారీ చేసిన రెండు ఆఫీస్ మెమోరాండమ్ (ఓఎం)ల ద్వారా హోం మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఎ) జారీ చేసిన మార్గదర్శకాల మేరకే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించాలనే గడువు విధిస్తూ ఏప్రిల్ 8, 2025వ తేదీన తీర్పు ఇవ్వడం జరిగిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
మార్గదర్శకాల్లో హోంశాఖ నిర్దేశించిన కాలపరిమితి సముచితమైనదని మేము భావించాము. గవర్నర్ పరిశీలన కోసం రిజర్వ్ చేయబడిన బిల్లులపై కూడా ఆవిధమైన మార్గదర్శకాలను పాటించాలని, రాష్ట్రపతి కూడా మూడు నెల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించినట్లు సుప్రీంకోర్టు తీర్పుని పరిశీలించిన జస్టిస్ జె.బి పార్దివాలా పేర్కొన్నారు.
ఆర్టికల్ 201 కింద గవర్నర్లు రాష్ట్రపతికి చేసిన సూచనలను పరిష్కరించడంలో సత్వరమే చర్యలు తీసుకోవాలని గతంలో సర్కారియా, పూంచి కమిషన్లు చేసిన సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు కూడా సమిష్టిగా పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 4, 2016న జారీ చేసిన మొదటి ఆఫీస్ మెమోరాండమ్ని పరిశీలిస్తే, స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బిల్లులపై తుది నిర్ణయం తీసుకోవడంపై జరిగిన అనవసర జాప్యాన్ని ప్రస్తావించింది.
రాష్ట్ర ప్రభుత్వాల నుండి బిల్లులు అందించిన తర్వాత వాటిని ఖరారు చేయడానికి గరిష్టంగా మూడు నెలల కాలపరిమితిని ఖచ్చితంగా పాటించాలని మెమోరాండమ్ పేర్కొంది. గవర్నర్ రాష్ట్రపతికి సూచన చేసిన తర్వాత జరిగే ప్రక్రియను పైన పేర్కొన్న మెమోరాండం సూచిస్తుందని, దీని ప్రకారమే రాష్ట్రపతికి బిల్లులపై కాలపరిమితి విధిస్తూ తీర్పును వెలువరించినట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
బిల్లులకు సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తే, మొదటగా నోడల్ మంత్రిత్వశాఖ రాష్ట్ర బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలను కేంద్రంలోని తగిన మంత్రిత్వశాఖకు హోంమంత్రిత్వశాఖ నివేదిస్తుందని కోర్టు వివరించింది. బిల్లులకు సంబంధించిన భాష, ముసాయిదా లేదా రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించిన సమస్యలను కేంద్ర న్యాయమంత్రిత్వశాఖకు సూచిస్తారు. సమస్యలపై ఆయా మంత్రిత్వశాఖలు 15 రోజుల్లోపు హోంమంత్రిత్వశాఖకు తిరిగి నివేదించాలి.
ఒకవేళ హోంమంత్రిత్వశాఖకు నివేదిక ఆలస్యమైతే దానికి కారణాలను కూడా స్పష్టంగా పేర్కొనాలి. బిల్లులపై రాష్ట్రానికి గరిష్టంగా ఒక నెల మాత్రమే గడువు ఉంటుంది. ఆర్డినెన్స్‌లకు సంబంధించి మూడు వారాలు, బిల్లులపై మూడు నెలల కాలపరిమితిని నిర్దేశించినట్లు ఆఫీస్ మెమోరాండమ్‌లో స్పష్టంగా ఉన్నట్లు జస్టిస్ పార్దివాలా తెలిపారు.
అలాగే రాష్ట్ర బిల్లులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలకు సంబంధించి మంత్రిత్వశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను, అభిప్రాయాలను లేదా మరిన్ని వివరాల కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని అదేరోజున (ఫిబ్రవరి 4 2016) జారీ చేసిన రెండవ ఓఎం కూడా పేర్కొంది. బిల్లులపై సంబంధిత మంత్రిత్వశాఖ విధించిన ఒక నెల గడువుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. లేకపోతే ఆ బిల్లుకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రంపై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
ఈ రెండు మెమోరాండమ్‌లు కూడా ఆర్టికల్ 201 కింద సమయపాలన విధించాలనేదే స్పష్టం చేస్తుంది. వీటి ప్రకారమే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగిందని జస్టిస్ పార్దివాలా వివరించారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన