జ‌గ‌ద్గురు స్వామి రామ‌భ‌ద్రాచార్య‌కు జ్ఞాన‌పీఠ అవార్డు

జ‌గ‌ద్గురు స్వామి రామ‌భ‌ద్రాచార్య‌కు జ్ఞాన‌పీఠ అవార్డు

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా జ‌గ‌ద్గురు స్వామి రామ‌భ‌ద్రాచార్య  జ్ఞాన‌పీఠ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న‌కు అవార్డును అంద‌జేశారు. చిత్ర‌కూట్‌లో ఉన్న తుల‌సీ పీఠాన్ని ఆయ‌న స్ధాపించారు. హిందూ ఆధ్యాత్మిక గురువు ఆయ‌న‌. సంస్కృత భాష‌లో అమోఘ పండితుడు. ఆయ‌న సుమారు 240 పుస్త‌కాలు రాశారు. 

అవార్డు ప్ర‌దానోత్స‌వంలో భాగంగా ఆ సంస్కృత జ్ఞానికి ఓ ప్ర‌శంసా ప‌త్రం, న‌గదు పుర‌స్కారం, వాగ్దేవి స‌రస్వ‌తీ విగ్ర‌హాన్ని బ‌హూక‌రించారు. సంస్కృత సాహిత్యానికి, స‌మాజానికి స్వామి రామ‌భ‌ద్రాచార్య బ‌హుళ ప‌ద్ధ‌తుల్లో సేవ‌లు అందించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి ముర్ము పేర్కొన్నారు. సంఘ‌ర్ష‌ణ ఎంత పెద్ద‌గా ఉంటే, విజ‌యం కూడా అంత పెద్ద‌గా ఉంటుంద‌ని స్వామి రామ‌భ‌ద్రాచార్య తెలిపారు. చాన్నాళ్ల నుంచి పోరాటం చేశాన‌ని, అందుకే స‌క్సెస్ భారీగా ఉన్న‌ట్లు చెప్పారు. మొద‌టిసారి ఓ సాధువుకు జ్ఞాన‌పీఠ అవార్డును ఇచ్చిన‌ట్లు తెలిపారు. 250 పుస్త‌కాలు రాశాన‌ని, దాంట్లో 150 పుస్త‌కాలు సంస్కృత భాష‌లో రాసిన‌ట్లు చెప్పారు. 

ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఆప‌రేష‌న్ సింధూర్ గురించి కూడా ఆయ‌న కామెంట్ చేశారు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారం ఆప‌రేష‌న్ సింధూర్ అన్నారు. దీని నుంచి కోలుకునేందుకు పాకిస్థాన్‌కు వందేళ్లు ప‌డుతుంద‌న్నారు. పాణిని రాసిన అష్టాధ్యాయపై రామ‌భ‌ద్రాచార్య వ్యాఖ్యానం చేశారు. బ్ర‌హ్మ‌సూత్రాలు, భ‌గ‌వ‌ద్గీత‌, ఉప‌నిష‌తుల‌పై కూడా రామ‌భ‌ద్రాచార్య ఎన్నో సంస్కృత వ్యాఖ్యానాలు చేశారు. 

సంస్కృత భాష‌లో రాసిన ఎన్నెన్నో ప్రాచీన గ్రంధాల‌ను చ‌ద‌వి, అవ‌గ‌తం చేసుకున్న‌ట్లు రామ‌భ‌ద్రాచార్య తెలిపారు. అయిదేళ్ల వ‌య‌సులో ఆయ‌న భ‌గ‌వ‌ద్గీత అధ్య‌య‌నం చేశారు. ఏడ‌ళ్ల వ‌య‌సులో గురువుల స‌మ‌క్షంలో రామ‌చ‌రిత‌మాన‌స చ‌దివారు. సంస్కృత భాష‌పై ఆయ‌న విస్తృత స్థాయిలో అధ్య‌య‌నం చేశారు. ఆ భాష‌లో ఔన‌త్యాన్ని ఆయ‌న అర్థం చేసుకున్న తీరు అనిర్వ‌చ‌నీయం. యూనివ‌ర్సిటీ చ‌దువుల్లో ఆయ‌న‌ సంస్కృత భాష‌లో గోల్డ్ మెడ‌ల్స్ సాధించారు.