పహల్గమ్ దాడి తర్వాత తిరుమల భద్రతపై మరింత అప్రమత్తం

పహల్గమ్ దాడి తర్వాత తిరుమల భద్రతపై మరింత అప్రమత్తం
పహల్గమ్ ఉగ్రదాడి అనంతరం వచ్చిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని తిరుమల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీ పాలకమండలి పలు నిర్ణయాలను తీసుకుంది. ప్రతి రోజూ దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం కావడం వల్ల భద్రతపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తోంది. 
 
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తికరంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టింది. దీనిపై చర్చించడానికి అత్యున్నత సమీక్ష సమావేశాన్ని టీటీడీ పాలకమండలి నిర్వహించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఏర్పాటైన ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెముషి అధ్యక్షత వహించారు. 
 
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడంపై ద్రష్టి సారించామని, ఇందులో భాగంగా సెక్యూరిటీ ఆడిట్ చేపట్టామని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మ‌నోభావాలను కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
 
2023 మేలో నిర్వహించిన భద్రతా ఆడిట్, నాటి సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు, టీటీడీ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ఇన్‌ఛార్జి సీవీఎస్వో, తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 
 
ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోం గార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయ పరచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని డీఐజీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని యాక్సెస్ కంట్రోల్ బృందాలకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలని షెముషి చెప్పారు. 
 
తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు.భద్రతా సిబ్బందికి కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ ముప్పులపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. యాంటీ సాబొటేజ్ చ‌ర్య‌లు, మాక్ డ్రిల్స్, ఎవాక్యుయేషన్ డ్రిల్స్ వంటి అంశాలపై శిక్షణలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయిం తీసుకున్నారు.