భారత్‌ ముందు చైనా, పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ పనికిరావు

భారత్‌ ముందు చైనా, పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ పనికిరావు

ఉగ్రవాదాన్ని పోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను అమెరికా రక్షణ రంగ నిపుణుడు జాన్‌ స్పెన్సర్‌ సమర్థించారు. పాక్‌పై భారత్‌ దాడి, రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని కొనియాడారు. ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్‌లోని ఏ ప్రదేశంలోనైనా ఎప్పుడైనా దాడి చేయగలమన్న సందేశాన్ని దాయాదికి పంపిందని తెలిపారు.ఓ ప్రముఖ జాతీయ మీడియాకుఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాన్‌ స్పెన్సర్‌ మాట్లాడుతూ భారత రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చైనా, పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ చాలా బలహీనమని అభిప్రాయపడ్డారు.

భారత్‌ సామర్థ్యం ముందు అవి ఎందుకూ పనికిరావన్నారుని స్పష్టం చేశారు. “అటు దాడికి అవసరమైన దూకుడును, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని భారత్‌ చూపించింది. పాక్‌ డ్రోన్‌ దాడులు, హై-స్పీడ్‌ క్షిపణులను ఎదుర్కోవడంతో సహా తనను తాను విజయవంతంగా రక్షించుకోవడంలో భారత్‌ విజయవంతమైంది. పాక్‌ను ఎప్పుడైనా, ఎక్కడైనా దెబ్బ కొట్టగలమని నిరూపించింది” అని గుర్తు చేశారు.

“భారత్‌పై దాడికి చైనా వైమానిక రక్షణ వ్యవస్థను పాక్‌ ఉపయోగించింది. అవి ఘోరంగా విఫలమయ్యాయి. భారత సామర్థ్యం ముందు అవి నిలువలేకపోయాయి. భారతదేశ అధునాతన సైనిక సామర్థ్యానికి బ్రహ్మోస్‌ క్షిపణి నిదర్శనం. చైనా, పాక్‌ వైమానిక రక్షణ వ్యవస్థలను బ్రహ్మోస్‌ ధ్వంసం చేసేసింది’ అంటూ భారత్‌ సామర్థ్యాన్ని కీర్తించారు.

కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌తో గట్టి బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతిదాడిగా మే 10న భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామాబాద్‌ డ్రోన్‌, క్షిపణి దాడులకు యత్నించింది. దీంతో భారత్‌ పాక్‌ భూభాగంలోని 11 వైమానిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడులకు భారత్‌ ‘బ్రహ్మోస్’ క్షిపణులను వాడింది.