ప్రపంచ అందగత్తెల పోటీ పేరుతో తెలంగాణ మహిళలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం కాంగ్రెస్ ప్రభుత్వ బానిసత్వానికి, మహిళల పై ద్వేష భావానికి నిదర్శనం అంటూ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం మీద దాడే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
అందాల పోటీల్లో భాగంగా రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చిన సుందరీమణుల కాళ్లను తెలంగాణ ఆడపడుచుల చేత కడిగించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆమె ధ్వజమెత్తారు. దళిత, గిరిజన మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు మరింత అవమానకరం. ఈ చర్యకు రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణ ఘటనకు తక్షణ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ గర్వించే సమ్మక్క సారలక్క పుట్టిన ప్రాంతంలో ఇలాంటి అవమానం జరగడం పట్ల డా. శిల్పారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరి గౌరవం తప్పనిసరి అని పేర్కొంటూ అందాల పోటీలకు వచ్చిన విదేశీ సుందరీమణుల గౌరవం కూడా చాలా ముఖ్యమే అని ఆమె తెలిపారు. కాని మన సొంత ఆడపడుచుల గౌరవం తగ్గకుండా చూసుకోవాలని ఆమె హితవు చెప్పారు. మహిళల ఆత్మగౌరవం పరిరక్షణకే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మన సంస్కృతిని, మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని ఆమె చెప్పారు.
కాగా, తెలంగాణ గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా విదేశీ అందగత్తెల కాళ్లు కడిగించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రి సీతక్క వైఖరిని బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం మహిళల అవమానమే కాదు, గిరిజనులకే అవమానం అని పేర్కొంటూ మహిళల హక్కులను కాపాడాల్సిన మంత్రి సీతక్క గిరిజన మహిళల చేత వీటిని చేయించడం ఎంత దారుణమో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి