మణిపుర్​లో 10 మంది మిలిటెంట్లు హతం

మణిపుర్​లో 10 మంది మిలిటెంట్లు హతం
మణిపుర్‌లో చందేల్‌ జిల్లాలో బుధవారం రాత్రి అసోం రైఫిల్స్‌ జరిపిన ఆపరేషన్‌లో కనీసం 10మంది మిలిటెంట్లు మరణించారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇండో- మయన్మార్‌ సరిహద్దు చందేల్‌ జిల్లా ఖెంగ్‌జోయ్‌ తహసీల్, న్యూ సమతాల్‌ గ్రామం సమీపంలో మిలిటెంట్ల కదలికలపై సమాచారం అందిందని అధికారులు పేర్కొన్నారు. 

దీంతో ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 10మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు వెల్లడించారు. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.  

ఎన్‌కౌంటర్‌పై ఈస్ట్ కమాండ్ అధికారిక ఎక్స్ ఖాతాలో ‘‘చందేల్ జిల్లా ఖెంగ్‌జాయ్ తేహ్సీల్‌లోని న్యూ సమ్తాల్ గ్రామం సమీపంలో మిలిటెంట్ క్యాడర్ల కదలికలపై నిఘా ఆధారంగా అసోం రైఫిల్స్ బలగాలు ఆపరేషన్‌కు చేపట్టాయి’’ అని పేర్కొంది. ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలపై మిలిటెంట్‌లు కాల్పులు జరపగా, జవాన్లు తక్షణమే కౌంటర్ ఫైరింగ్ చేపట్టి, వ్యూహాత్మకంగా తిరిగి చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా, మణిపుర్​లోని ఉఖ్రుల్​ జిల్లాలో వచ్చే వారం నుంచి ఐదు రోజుల పండుగ జరగనుంది. ఈ సందర్భంగా కుకీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మైతేయిలు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ఏదైనా ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా పరిగణిస్తామని చెప్పారు. ఆ తర్వాత జరగే పరిణామాలకు వ్యుక్తులే పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ మేరకు కుకీ జో విలేజ్ వలంటీర్ ఈస్టర్న్ జోన్ ఓ ప్రకటన జారీ చేసింది.

ఉఖ్రుల్​లో జరిగే శిరుయ్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మెయితైలు ఎక్కువగా ఉన్న ఇంఫాల్ నుంచి ఉఖ్రుల్‌కు వెళ్లే మార్గంలో- కుకీలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాల గుండా వెళ్లాలి. కాగా, ఉఖ్రుల్​లో నాగా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ హెచ్చరికను తంగ్ఖుల్​ నాగ సామాజిక కార్యకర్త అసంగ్ కాషర్ ఖండించారు. 

ఇది మణిపుర్‌లోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా ఒక సవాలు అని, దీనివల్ల వారు (కుకీలు) శాంతికి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. మరోవైపు, మణిపుర్​లో జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మే 2023 నుంచి జరిగిన జాతి ఘర్షణల వల్ల దాదాపు 260మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.