తుర్కియే వర్సిటీతో జేఎన్‌యూ ఒప్పందం నిలిపివేత

తుర్కియే వర్సిటీతో జేఎన్‌యూ ఒప్పందం నిలిపివేత
తుర్కియేలోని ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) నిలిపివేసినట్లు జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) ప్రకటించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌ పోస్ట్‌లో వెల్లడించింది.  “జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా  జేఎన్‌యూ ఈ అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎందుకంటే జేఎన్‌యూ దేశం, సాయుధ దళాలకు మద్దతు ఇస్తుంది. వీరిలో చాలామంది  జేఎన్‌యూ పూర్వ విద్యార్థులు ఉన్నారు,” అని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ తెలిపారు.

భారత్- పాక్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే పాకిస్థాన్​కు తుర్కియే మద్దతు ఇవ్వడంపై భారత్​లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మన ట్రావెల్‌ ఏజెన్సీలు తుర్కియేకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు డిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ తాజాగా ప్రకటించింది.

దేశ భద్రత దృష్ట్యా ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను ప్రస్తుతం నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరుదేశాల యూనివర్సిటీల మధ్య ఇటీవల మూడేళ్లకు గాను విద్యాపరమైన ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం 2025 ఫిబ్రవరి 3న మూడేళ్ల కాలపరిమితికి కుదిరింది. ఇది 2028 ఫిబ్రవరి 2 వరకు అమల్లో ఉండాల్సి ఉంది.

ఇక ఇనొను యూనివర్సిటీ తుర్కియేలోని మలట్యాలో ఉంది. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఇటీవల జేఎన్‌యూ, ఇనొను యూనివర్సిటీల మధ్య ఎంవోయూ కుదిరింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడం భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ భారత లక్ష్యాలపై టర్కీ తయారుచేసి డ్రోన్లను ఉపయోగించిందన్న ఆరోపణలు మరింత ఆగ్రహానికి దారితీశాయి.