
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత 1960 సింధు జలాల ఒప్పందాన్ని “తక్షణమే” నిలిపివేస్తున్నట్లు భారతదేశం పాకిస్తాన్‌కు తెలియజేసిన పక్షం రోజుల తర్వాత, ఇస్లామాబాద్ మొదటిసారిగా ఈ ఒప్పందం గురించి భారత ప్రభుత్వంతో చర్చించడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం గురించి భారతదేశం అధికారికంగా తెలియజేయడంపై పాకిస్తాన్ జల వనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా ఇటీవల స్పందించారని, భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిర్దిష్ట నిబంధనలను తన ప్రభుత్వం తరపున చర్చించడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది.
అయితే, ఒప్పందంలోనే ఎటువంటి నిష్క్రమణ నిబంధన లేదని ఎత్తి చూపుతూ ముర్తజా ఈ నిర్ణయం ఆధారాన్ని ప్రశ్నించారు. భారతదేశపు అభ్యంతరాలను చర్చించడానికి ముర్తాజా ప్రతిపాదించడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే జనవరి 2023లో, మళ్ళీ సెప్టెంబర్ 2024లో ఈ ఒప్పందంపై “సమీక్ష, సవరణ” కోసం అభ్యర్థిస్తూ రెండు ముందస్తు నోటీసులు భారత్ ఇచ్చినప్పటికీ, పాకిస్తాన్ ఇప్పటివరకు తన స్పష్టమైన సుముఖతను వ్యక్తం చేయలేదు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేసిన తర్వాత మాత్రమే, పాకిస్తాన్ తన సుముఖతను సూచించినట్లు కనిపిస్తుంది. నాలుగు రోజుల సైనిక ఘర్షణ తర్వాత శత్రుత్వాలు ఆగిపోయినందున, సింధు జలాల ఒప్పందంలో పాల్గొనడానికి పాకిస్తాన్ సుముఖత గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.
నీటిని నిల్వ చేయడానికి ఆనకట్టలు, జలాశయాలను నిర్మించడం ద్వారా నదిలోని నీటిని ఉపయోగించుకోవాలని, దానిని విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగించుకోవాలని భారతదేశం ఆసక్తిగా ఉంది. ఏదైనా నిర్మాణం భూమిపై ఉన్న స్థితిని మారుస్తుంది కాబట్టి, అటువంటి ప్రణాళికలను నిలిపివేసేటట్లు చూడాలని ఇస్లామాబాద్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.
పహల్గామ్ దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 24న భారత అధికారి దేబశ్రీ ముఖర్జీ రాసిన లేఖకు ప్రతిస్పందనగా ముర్తాజా సందేశం వచ్చింది. “ఒప్పందాన్ని మంచి విశ్వాసంతో గౌరవించాల్సిన బాధ్యత ఒక ఒప్పందానికి ప్రాథమికమైనది. అయితే, మనం చూసింది ఏమిటంటే, భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ కొనసాగించే సీమాంతర ఉగ్రవాదం” అని ముఖర్జీ రాశారు.
భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గత మంగళవారం ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, “ఒప్పందం ముందుమాటలో పేర్కొన్న విధంగా, సద్భావన, స్నేహ స్ఫూర్తితో సింధు జలాల ఒప్పందం ముగిసింది. పాకిస్తాన్ విశ్వసనీయంగా మరియు తిరిగి మార్చలేని విధంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు భారతదేశం ఒప్పందాన్ని నిలుపుదల చేస్తుంది” అంటూ ఉగ్రవాదం విషయం తేలేవరకు ఈ ఒప్పందం గురించి చర్చించే అవకాశం లేదనే సంకేతం ఇచ్చారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్