
2013–14 ఆర్థిక సంవత్సరానికి రూ.686 కోట్లుగా ఉన్న భారతదేశ రక్షణ రంగ ఎగుమతుల విలువ 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.23,622 కోట్లకు చేరాయి. అంటే గత పదేళ్లలో భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు దాదాపు 34 రెట్లు పెరిగాయి. రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ ప్రపంచవ్యాప్తంగా తన గుర్తింపును బలోపేతం చేసుకుంటోంది.
భారత్‌లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, కచ్చితత్వం, శక్తియుక్తులపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడింది. అందువల్లే అవి భారతీయ రక్షణ రంగ సంస్థలకు పదేపదే ఆర్డర్లు ఇస్తున్నాయి. పర్యవసానంగా గత పదేళ్లలో భారత రక్షణరంగ ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి సాధ్యమైంది. ‘ఆపరేషన్ సిందూర్’ వంటి సక్సెస్ ఫుల్ మిలిటరీ ఆపరేషన్లు భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుండటం మరో పెద్ద అడ్వాంటేజీ.
భారత్ ప్రస్తుతం దాదాపు 80కిపైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2029 నాటికి రూ.50,000 కోట్ల వార్షిక టర్నోవర్‌ను భారత రక్షణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత్ రక్షణ ఎగుమతులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.23,622 కోట్లకు చేరుకున్నాయి. 2023-2024తో పోలిస్తే 2024–25లో ఈ ఎగుమతులు రూ.2,539 కోట్లు(12.04 శాతం) మేర పెరిగాయి. ఈ గణాంకాలతో భారత రక్షణ మంత్రి కార్యాలయం బుధవారం (మే 14న) మధ్యాహ్నం ఒక ట్వీట్ చేసింది.
భారత రక్షణ శాఖ ప్రకారం, భారత్ నుంచి 2023-2024లో రూ.21,083 కోట్లు, 2022-2023లో రూ.15,920 కోట్లు, 2021-2022లో రూ.12,815 కోట్లు, 2020-2021లో రూ.8,435 కోట్లు విలువైన రక్షణ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతుల వృద్ధిలో ప్రైవేటు సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి. 2024–25లో ప్రైవేటు రంగం రూ.15,233 కోట్లు విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇక ఇదే సమయంలో భారత రక్షణ విభాగం ప్రభుత్వ రంగ సంస్థలు రూ.8,389 కోట్ల ఎగుమతులు చేశాయి.
2023–24 ఆర్థిక సంవత్సరం లెక్కల్లోకి వెళితే, ప్రైవేటు రంగం రూ.15,209 కోట్లు, ప్రభుత్వ రంగం రూ.5,874 కోట్లు విలువైన రక్షణ ఎగుమతులను సాధించాయి. కేంద్రంలోని మోదీ సర్కారు చేసిన కొన్ని విధానపరమైన సంస్కరణల ప్రభావంతో భారత రక్షణ ఎగుమతులు అమాంతం పెరిగాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ విభాగంలో పనిచేసే ప్రైవేటు సంస్థలకు ఈజీగా పారిశ్రామిక లైసెన్సులను జారీ చేశారు.
దీంతో ఈ విభాగంలో పెద్దసంఖ్యలో స్టార్టప్‌లు, మధ్యతరహా పరిశ్రమలు వెలిశాయి. కొన్ని నిర్దిష్ట రక్షణరంగ పరికరాలను తయారు చేసే కంపెనీలకు లైసెన్సులు అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. రక్షణ రంగ ఎగుమతుల ధ్రువీకరణ, అనుమతుల జారీ ప్రక్రియను అధునాతన టెక్నాలజీతో కేంద్ర సర్కారు వేగవంతం చేసింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు