భారత అమ్ములపొదిలో మరో దివ్యాస్త్రం చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మైక్రో రాకెట్ వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆపరేషన్ సిందూర్తో పాక్ను కాళ్ల బేరానికి తీసుకొచ్చిన భారత్, ఇప్పుడు శత్రు డ్రోన్లను ధ్వంసం చేసే సరికొత్త అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకుంది. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల పాత్ర చాలా కీలకంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరుదేశాలు వేలాది డ్రోన్లను ప్రయోగించుకున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియేకు చెందిన వందలాది డ్రోన్లను భారత్ నగరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రయోగించింది. ఐతే మన గగనతల రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. దేశ భద్రతకు ఈ డ్రోన్లు సవాళ్లుగా మారుతున్నాయి. భవిష్యత్తులోనూ ఇలాంటి ముప్పులు ఎదురైతే శత్రు డ్రోన్ల సమూహాన్ని నిర్వీర్యం చేసేందుకు భారత్ సర్వసన్నద్ధమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది.
ఒడిశా గోపాల్‌పుర్‌లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను పరీక్షించగా, అన్ని లక్ష్యాలను విజయవంతగా ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దీనికి మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించారు. రెండు ట్రయల్స్‌లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు. మూడో దశలో రెండు రాకెట్లను ఒకేసారి 2 సెకన్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు.
ఈ భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు. ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు.
తొలి లేయర్‌లో అన్‌గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. ఇక, రెండో లేయర్‌లో గైడెడ్ మైక్రో మిసైల్‌ను ఉంచుతారు. ఇవి లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండల ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

More Stories
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు
ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గా ఔరంగాబాద్
సర్‌క్రీక్ వద్ద భారత త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు