పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పై 15 లక్షల సైబర్ దాడులు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పై 15 లక్షల సైబర్ దాడులు
భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణతో ఉద్రిక్తతలు తగ్గినా, భారత్ పై సైబర్‌దాడులు ఇంకా కొనసాగుతున్నాయని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌లో 15 లక్షల సైబర్‌ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో 150 విజయవంతమైనట్లు పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఈ దాడులు జరిగినట్లు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన (ఏప్రిల్ 22) తర్వాత భారీ స్థాయిలో డిజిటల్ దాడులు పెరిగాయని మహారాష్ట్ర సైబర్‌ నేరాల నియంత్రణ విభాగం సీనియర్‌ అధికారి మీడియాకు ఒకరు తెలిపారు. భారత్ కు చెందిన వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్‌, పశ్చిమాసియా, ఇండోనేసియా హ్యాకర్లు వీటికి పాల్పడినట్లు వెల్లడించారు.  “హ్యాకర్లు ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించారు. విమానయానం, మున్సిపల్ సిస్టమ్స్‌, ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు” అని తెలిపారు. 

“భారత్‌-పాకిస్థాన్ కాల్పుల విరమణ తర్వాత కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్‌ దాడులు పూర్తిస్థాయిలో తగ్గలేదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేసియా, మొరాకో, పశ్చిమాసియా దేశాల నుంచి ఈ సైబర్‌ దాడులు ఎదురవుతూనే ఉన్నాయి” ఆ సీనియర్ అధికారి తెలిపారు.  మహారాష్ట్రలో సైబర్ డిపార్ట్‌మెంట్‌ నోడల్ ఆఫీస్గా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. 

సైబర్ నేరాల దర్యాప్తు, భద్రతా నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు అధికారులు. సైబర్‌ దాడులకు గురైతే బాధితులు 1945, 1930 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.