‘బాయ్‌కాట్‌ టర్కీ’ నినాదంతో దిమ్మతిరిగింది టర్కీ

‘బాయ్‌కాట్‌ టర్కీ’ నినాదంతో దిమ్మతిరిగింది టర్కీ
భారత్‌- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ టర్కీ  అత్యుత్సాహంతో దాయాది దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగిన మూల్యం చెల్లించుకుంది. టర్కీ తీరును నిరసిస్తూ భారత్‌ లో ఆ దేశానికి వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్‌ టర్కీ’ నినాదం ఊపందుకుంది. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని ఇక్కడి వ్యాపారులు నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.
 
ఎర్డోగాన్‌ ప్రభుత్వ తీరుపై మన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. యుద్ధ సమయంలో పాక్‌కు తుర్కియే బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా డ్రోన్లను సాయం చేసిన విషయం విదితమే. ఆ డ్రోన్లనే పాక్‌ మన దేశంపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్‌ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్‌, బాన్‌ తుర్కియే’ని ట్రెండ్‌ చేస్తున్నారు. 
మొన్నటివరకు సోషల్‌మీడియాలో కొనసాగిన ఈ ట్రెండ్‌ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అన్ని రంగాలకు వ్యాపిస్తున్నది. 
ఇప్పటికే తుర్కియే టూరిజంపై దాని ప్రభావం పడింది. ఆ దేశానికి వెళ్లాలనుకునే అనేక మంది భారతీయ పర్యాటకులు విమాన టికెట్లు, హోటళ్ల బుకింగ్‌లను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా బుకింగ్‌లు వాయిదా లేదా క్యాన్సిల్‌ అయినట్టు తెలుస్తున్నది. రాజధాని అంకారా టూరిజం తీవ్రంగా ప్రభావితమైంది.  ‘బ్యాన్‌ టర్కీ’ అంటూ పలువురు వ్యాపారులు ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. పుణెలోని వ్యాపారులు కూడా టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్‌లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.

పుణె మార్కెట్‌లో ఒక సీజన్‌లో టర్కీ యాపిల్‌ల టర్నోవర్‌ రూ.1000 నుంచి 1200 కోట్ల వరకు ఉంటుంది. ఈ క్రమంలో టర్కీ యాపిల్స్‌ను నిషేధించడంవల్ల పండ్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం దీన్ని తాము ఆర్థిక నిర్ణయంగా మాత్రమే కాదని, ప్రభుత్వానికి, సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని అంటున్నారు. యాపిల్‌లను అక్కడ నుంచి దిగుమతి చేసుకునే బదులు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.

మరోవైపు భారత పర్యాటకులు టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీ కోసం తాము తమ డబ్బును ఖర్చుపెట్టదల్చుకోలేదని వారు ప్రకటించారు.  దాంతో టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలికితే తనకు ఎంత నష్టమో గ్రహించింది. అందుకే ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. టర్కీ పర్యాటక శాఖ భారత పర్యాటకులకు ఒక బహిరంగ అభ్యర్థన చేసింది. మా దేశంలో మీ భద్రతకు ఎలాంటి హాని జరగనీయబోమని, మీ వసతి సౌకర్యాలకు ఎలాంటి లోటు రానీయబోమని, మా దేశ పర్యటనను భారత పర్యాటకులు రద్దు చేసుకోవద్దని అభ్యర్థిస్తూ ఒక ప్రకటన వెలువరించింది.

భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్న సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపింది. పాకిస్థాన్‌ సైన్యానికి అండగా తన నేవీ షిప్‌ను కూడా పంపింది. సరిగ్గా అప్పుడే పాకిస్థాన్‌పై భారత్‌ చేసిన భీకర దాడులకు జడుసుకుని తోకముడిచింది. అయితే అప్పటికే టర్కీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత పౌరుల దృష్టిలో టర్కీ ఒక విలన్‌లా మిగిలిపోయింది.