గడ్చిరోలి జిల్లాలో 25 మంది మావోయిస్టులు మృతి?

గడ్చిరోలి జిల్లాలో  25 మంది మావోయిస్టులు మృతి?

భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరులో 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర రాష్ర్టాల సరిహద్దుల్లో సోమవారం చోటుచేసుకున్నది.  మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లా భామ్రగఢ్‌ దళానికి చెందిన మావోయిస్టులు కన్వాడే పోలీస్‌స్టేషన్‌ పరిధి ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జ్‌ వద్ద క్యాంపు నిర్వహించినట్టు పోలీస్‌ వర్గాలకు సమాచారం అందింది. 

దీంతో అదనపు ఎస్పీ ఎం రమేశ్‌ నేతృత్వంలో 200 మంది సీ-60 భద్రతా దళాలు ఆదివారం రాత్రి నుంచి సెర్చింగ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేశా యి. సోమవారం ఉదయం జవాన్లకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య విడతలవారీగా భీకర కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి పారిపోయారు.

అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమం లో ఘటనా స్థలం నుంచి ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌, ఒక సింగిల్‌ షాట్‌ రైఫిల్‌, ఒక మ్యాగజైన్‌, లైవ్‌ రౌండ్లు, డిటోనేటర్లు, ఒక రేడియోతోపాటు పెద్ద ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన ఇతర ఆయుధ, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఆ ప్రాంతంలోని మావోయిస్టుల స్థావరాలను బలగాలు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో సుమారు 25 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. మృతుల వివరాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉన్నది.