జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం

* పెహల్‌గామ్‌ ఉగ్రవాదుల కోసం పోస్టర్లు

జమ్ము కశ్మీర్‌ షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన నలుగురు టెర్రరిస్ట్‌లు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ, పారామిలిటరీ దళాలు మంగళవారం ఉదయం ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. తొలుత కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. 

తర్వాత షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజా ఘటనతో ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు. షోపియాన్, శుక్రూ కెల్లర్ ఏరియాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  చనిపోయిన ఉగ్రవాదుల్లో స్థానిక వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి పేరు షాహిద్‌గా తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య రెండు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో మొదట ఓ ఉగ్రవాది చనిపోయాడు. మిగిలిన ఇద్దర్నీ చుట్టుముట్టిన బలగాలు అరగంట వ్యవధిలోనే కాల్చి చంపేశాయి.

మరోవంక, పెహల్‌గామ్‌ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థాన్‌ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గత కొన్ని రోజులుగా కశ్మీర్‌ లోయలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఫోటోలు ఉన్న పోస్టర్లను భద్రతా సంస్థలు తాజాగా విడుదల చేశాయి.  ‘టెర్రర్‌ ఫ్రీ కశ్మీర్‌’ అన్న సందేశంతో ఈ పోస్టర్లు జమ్ము కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో గల పలు ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి.

అందులో ఉగ్రవాదుల గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఆ పోస్టర్లలో అధికారులు పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటే తమకు ఇవ్వాలని స్థానికులు, పర్యాటకులను అధికారులు ఇప్పటికే కోరారు.

కాగా ఆరు రోజుల తర్వాత శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన కార్యకలాపాలు  మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి.తొలి విమానం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఎఐ 827 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరడంతో జమ్ము కశ్మీర్‌, పంజాబ్ లలో స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు కూడా తెరుచుకున్నాయి సరిహద్దు ప్రాంతాలు మినహా జమ్మూ కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలు మంగళవారం తిరిగి తెరచుకున్నాయి.