ఇండిగో, ఎయిర్‌ ఇండియా పెద్ద ఎత్తున విమానాలను రద్దు

ఇండిగో, ఎయిర్‌ ఇండియా పెద్ద ఎత్తున విమానాలను రద్దు
 
* జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్లతో దాడి!
 
భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్స్ చర్చలు ముగిసిన కొద్దిసేపటికే సోమవారం రాత్రి మరోసారి దాయాది కవ్వింపు చర్యలకు దిగింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్‌లో పాక్‌ నుంచి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఆ డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కుప్పకూల్చింది. ప్రస్తుతం సాంబా సెక్టార్‌లో అధికారులు బ్లాక్‌ అవుట్‌ను అమలు చేస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్లు సైన్యం పేర్కొంది. ప్రస్తుతం డ్రోన్లు ఏమి లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. సాంబా, కతువా, రాజోరి, జమ్ములో బ్లాక్​ అవుట్​ అమల్లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం వైష్ణో దేవి భవన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

భవనంతో పాటు, వైష్ణో దేవి వెళ్ళే మార్గంలో కూడా లైట్ల నిలిపివేసినట్లు సైనిక వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జమ్ముకశ్మీర్​తో పాటు పంజాబ్​లో బ్లాక్​ అవుట్​ చేశారు. ఢిల్లీ నుంచి అమృత్​సర్​ విమానాన్ని కూడా దారి మళ్లినట్లు తెలిపారు.

కాగా, ఇండిగో, ఎయిర్‌ ఇండియా మంగళవారం పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేశాయి. శ్రీనగర్‌, జమ్మూ, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా మరో మూడు సరిహద్దు ప్రాంతాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్‌లైన్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. 

జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌ నగరాలకు ఇండిగో విమానాలను రద్దు చేసింది. అయితే, ఇండిగో ప్రయాణికులకు అడ్వైజరీని జారీ చేసింది. తాజాగా పరిణామాల దృష్ట్యా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు బయలుదేరే మంగళవారం బయలుదేరే విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది.

భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో 75 నిముషాల ముందే చెక్ ఇన్ క్లోజ్‌ అవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణీకులు భద్రతా తనిఖీలు చెక్‌ ఇన్ ఫార్మాలిటీప్‌ పూర్తి చేసుకోవడానికి సమయానికి ముందే తమ తమ విమానాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగోతో పాటు స్పైస్‌జెట్ విజ్ఞప్తి చేశాయి.