కాళేశ్వర క్షేత్రంలో 15 నుంచి సరస్వతి పుష్కరాలు

కాళేశ్వర క్షేత్రంలో 15 నుంచి సరస్వతి పుష్కరాలు

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ క్షేత్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 15నుండి 26వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు జరుగనున్నాయి. ఈ పుష్కర మహోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది. 

కాళేశ్వరం వద్ద గోదావరి నది, ప్రాణహిత నది కలువనుంది. అక్కడే అంతర్వాహిణిగా సరస్వతి నది కలుస్తుంది. అందువల్ల ఈ ప్రాంతాన్నే పవిత్ర సంగమంగా భావిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాప్ట్రాల నుండి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

పుష్కర పనుల ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటిశాఖ మంత్రిశ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం నిత్యం సమీక్షలు, పనుల పరిశీలించి, త్వరితగతిన ఏర్పాట్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

దేశంలోని భక్తులందరూ పుష్కరాలకు చేరుకోవడానికి ఈ యాప్‌లో చూడవచ్చు. ఈవిధంగా ఈ మొబైల్ అప్లికేషన్ పుష్కరాలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో అందిస్తూ వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల నిధులతో పనులు చేపట్టారు.  నూతనంగా సరస్వతి ఘాట్‌ను నిర్మించారు. ఘాట్ వద్ద 20 అడుగుల సరస్వతి మాత నూతన విగ్రహం ఏర్పాటు చేశారు.

సాధారణ ఘాట్ వద్ద నూతన కమాన్‌ను నిర్మిస్తున్నారు. కాళేశ్వర ప్రధాన ఆలయం వద్ద ముందు భాగాన్ని మొత్తం సిసితో నిర్మించారు.  ప్రత్యేక మరుగుదొడ్లు, దుస్తుల మార్పిడి గదుల నిర్మాణం. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బస్‌స్టాండ్ నుండి త్రివేణి సంగమంనకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించారు. భక్తులు తిరిగే ప్రాంతంలో విద్యుత్ సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌డబ్లూఎస్ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు.

కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా వివిధ పీఠాధిపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 రోజులు యాగాలు, తొలిసారిగా నదిలో హారతులు ఇవ్వనున్నారు. 15న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హారతిలో పాల్గొని, ఆలయాన్ని దర్శించుకొని నూతన సరస్వతి మాత విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. 12 రోజుల పాటు అశేష భక్తజనం పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. 2013లో చివరిసారి సరస్వతి పుష్కరాలు జరిగాయి.