పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పీవోకే, ఉగ్ర‌వాదంపైనే

పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పీవోకే, ఉగ్ర‌వాదంపైనే
పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పీవోకే, ఉగ్ర‌వాదంపైనే దాయాది దేశం పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్, ఉగ్ర‌వాదంపైనే అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి మోదీ ప్ర‌సంగిస్తూ పాకిస్తాన్ బ‌త‌కాలంటే ఉగ్ర‌వాద శిబిరాల‌ను త‌నంత‌ట తానుగా తుడిచిపెట్టాలని తేల్చి చెప్పారు. 
“ఉగ్రవాదం, చ‌ర్చ‌లు రెండూ ఏక‌కాలంలో ఉండ‌వు. ఉగ్ర‌వాదం, వాణిజ్యం రెండూ ఏక‌కాలంలో ఉండ‌వు. ఉగ్ర‌వాదం, నీటి పంపిణీ రెండూ ఏక‌కాలంలో ఉండ‌వు. పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే ఉగ్ర‌వాదంపైనే. పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌పైనే” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 
ఉగ్ర‌వాదం, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ త‌ప్ప ఏ అంశంపైనా చ‌ర్చ‌లు ఉండ‌వని స్పష్టం చేస్తూ  ఉగ్ర‌వాదం ఏ రూపంలో ఉన్నా, ఎక్క‌డ ఉన్నాభార‌త్ తుద‌ముట్టించి తీరుతుందని ప్రధాని హెచ్చరించారు. భార‌త ర‌క్ష‌ణ ద‌ళాల సామ‌ర్థ్యం ఏమిట‌న్న‌ది ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా పాక్ చ‌విచూసిందని తెలిపారు. ఉగ్ర‌వాదానికి అన్న‌పానీయాలు అందించే ఎవ‌ర్నీ భార‌త్ ఉపేక్షించ‌దని తేల్చి చెప్పారు.
భార‌త్ ర‌క్ష‌ణ ద‌ళాల సామ‌ర్థ్యం ఏంటో ఆప‌రేష‌న్ సిందూర్ పాక్‌కు రుచిచూపించిందని ప్రధాని ఎద్దేవా చేశారు. సాంకేతిక యుద్ధంలో భార‌త్ ప‌రిణితి, ఆయుధ సంప‌త్తిని ప్ర‌ద‌ర్శించిందని, మేడిన్ ఇండియా ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు ఎంత బ‌ల‌మైన‌వో, ఎంత శ‌క్తివంత‌మైన‌వో భార‌త్ ప్ర‌ద‌ర్శించిందని చెప్పారు. ఈ యుగం యుద్ధాల‌ది కాదు, ఉగ్ర‌వాదానిది అంత‌కంటే కాదని పేర్కొంటూ ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా ఎలాంటి చ‌ర్య‌ల‌కు, దాడుల‌కు భార‌త్ వెనుకాడ‌దు అని మోదీ స్ప‌ష్టం చేశారు.
పాక్ అణు సామ‌ర్థ్య బ్లాక్ మెయిలింగ్‌ను ఇక స‌హించేది లేదని, అణుశ‌క్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే భార‌త్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ‌దు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తేల్చిచెప్పారు. పాకిస్థాన్ నుంచి ప్ర‌యోగించిన డ్రోన్లు, మిస్సైళ్ల‌ను భార‌త్ క్షిప‌ణి ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ స‌రిహ‌ద్దులు దాట‌కుండానే కూల్చేసిందని, భార‌త మిస్సైళ్లు పాక్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఛిన్నాభిన్నం చేసేశాయని ప్రధాని గుర్తు చేశారు. 
పాక్ గ‌ర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను భార‌త్ నిర్వీర్యం చేసిందని, పాకిస్తాన్ వైమానిక స్థావ‌రాలు, రాడార్ స్టేష‌న్ల‌లో భార‌త్ మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయని ప్రధాని తెలిపారు. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగ‌ర‌లేని స్థితిని భార‌త్ క‌ల్పించిందని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ మ‌ళ్లీ ఎలాంటి దుస్సాహ‌సానికి పాల్ప‌డ‌కుండా భార‌త్ బుద్ధి చెప్పిందని ప్రధాని స్పష్టం చేశారు. 
భార‌త్ ప్ర‌తిచ‌ర్య‌ల‌కు బెంబేలెత్తిన పాక్ కాల్పుల విర‌మ‌ణ‌కు ప్ర‌పంచం మొత్తాన్ని వేడుకుందని ప్రధాని గుర్తు చేశారు. భార‌త త్రివిధ ద‌ళాలు స‌ర్వ‌స‌న్నద్ధంగా ఉన్నాయని, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆప‌రేష‌న్ సిందూర్.. ఉగ్ర‌వాదంపై భార‌త్ వైఖ‌రిని విస్ప‌ష్టంగా చెప్పాయని ప్రధాని తెలిపారు. ఉగ్ర‌వాదంపై భార‌త్ ష‌ర‌తులు మేర‌కే చ‌ర్చ‌లు ఉంటాయని, భార‌త్ నిర్ణ‌యాల‌కు అనుగుణంగానే చ‌ర్చ‌లు ఉంటాయని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.
రెండున్న‌ర ద‌శాబ్దాలుగా పాక్‌లో విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్న ఉగ్ర‌వాద తండాల‌ను ఒక్క దెబ్బ‌తో తుడిచిపెట్టిందని ప్రధాని గుర్తు చేశారు. భార‌త్‌కు వ్య‌తిరేకంగా పాక్ నుంచి కుట్ర‌లు ప‌న్నుతున్న ఉగ్ర‌వాద తండాల‌ను తుద‌ముట్టించిందని, 100 మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిందని చెప్పారు.  భార‌త్ దెబ్బ‌కు పాకిస్తాన్ నిరాశ నిస్పృహ‌ల్లో కూరుకుపోయిందని, భార‌త్ దెబ్బ‌కు పాక్ అచేత‌నావ‌స్థ‌కు చేరుకుందని తెలిపారు.
దాడుల‌తో ఎటూ పాలుపోని పాకిస్తాన్ భార‌త్‌లోని జ‌నావాసాలు, పాఠ‌శాల‌ల‌పై దాడికి దిగింది అని మోదీ ధ్వజమెత్తారు. గ‌డిచిన నాలుగు రోజులుగా భార‌త సైన్యం సామ‌ర్థ్యాన్ని చూస్తున్నామని, నిఘా వ‌ర్గాల సామ‌ర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామ‌ర్థ్యాన్ని దేశం చూసిందని ప్రధాని ప్రశంసించారు. మ‌న దేశం అస‌మాన వీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించిందని పేర్కొంటూ భార‌త ర‌క్ష‌ణ ద‌ళాలు చూపిన ధైర్య సాహ‌సాలు దేశానికి త‌ల‌మానికం అని ప్ర‌ధాని మోదీ కొనియాడారు.