రేవంత్ ప్రభుత్వం దేశ ద్రోహులకు మద్దతు ఇస్తుందా?

రేవంత్ ప్రభుత్వం దేశ ద్రోహులకు మద్దతు ఇస్తుందా?
జిన్నారం మదర్సాపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొంటూ రేవంత్ ప్రభుత్వం దేశ ద్రోహులకు మద్దతు ఇస్తుందా? అని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు  ప్రశ్నించారు. ఒక ఎంపీగా అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. జిన్నారం మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తలను సోమవారం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు. 
ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ జిన్నారంలో అరెస్ట్ చేసిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. కిషన్‌గంజ్ పేరుతో జిన్నారం మదర్సాలో ఉంటున్నది ఎవరని ప్రశ్నించారు. జిన్నారంలోని కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారని ఆరోపించారు. జిన్నారంలో అక్రమ అరెస్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 
అరెస్టు చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిన్నారం వ్యవహారంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని మెదక్ ప్రశ్నించారు.  జిన్నారంలో ఏం జరుగుతుందో వెంటనే విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగు సార్లు ఎంపీగా తాను అడిగినా సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 
దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిన్నారం, పటాన్‌చెరు‌ మదర్సాల్లో చదువు చెప్పడానికి ఎక్కడి నుంచి తీసుకువచ్చారని ప్రశ్నించారు. 
జిన్నారం వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వకపోతే హిందువులు విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్ నందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఏ కేసుల్లో వారిని అరెస్ట్ చేశారని నిలదీశారు. ఆ మదర్సా ఉనికి గురించి రేవంత్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు.