భారత్ మాతా కీ జై నినాదం కాదు- సైనికులు చేసే ప్రతిజ్ఞ

భారత్ మాతా కీ జై నినాదం కాదు- సైనికులు చేసే ప్రతిజ్ఞ
భార‌త్ మాతా కీ జై అన్నది కేవ‌లం నినాదం కాదు అని, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే సైనికుల ప్ర‌తిజ్ఞ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అదంపూర్ ఎయిర్‌బేస్‌ను విజిట్ చేసిన ప్ర‌ధాని మోదీ అక్క‌డ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సైనికుల్ని ఉద్దేశించి మ‌న డ్రోన్లు, మిస్సైళ్లు శ‌త్రు దేశాన్ని తాకిన‌ప్పుడు, వాళ్లకు భార‌త్ మాతా కీ జై విన‌బ‌డుతుంద‌ని పేర్కొన్నారు. 
 
అణ్వాయుధ దాడి చేస్తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డిన వాళ్ల‌ను మ‌న సైనిక బ‌ల‌గాలు చుట్టేశాయ‌ని, అప్పుడు మ‌న శ‌త్రువుల‌కు భార‌త మాతా కీ జై నినాద ప్రాముఖ్య‌త అర్థ‌మైంద‌ని చెప్పారు. మీరు చూపిన తెగువ‌, ధైర్య‌సాహసాల‌ను అభినందించేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. మీరు చూపిన ధైర్యాన్ని భ‌విష్య‌త్తులో చ‌రిత్ర‌గా చెబుకుంటార‌ని కొనియాడారు. 
 
మ‌న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్న‌ట్లు చెప్పారు. మ‌నం ప్ర‌ద‌ర్శించిన సాహ‌సం వ‌ల్లే.. ప్ర‌పంచ దేశాల‌కు ఆప‌రేష‌న్ సింధూర్ స‌క్సెస్ వినిపించింద‌ని తెలిపారు. మ‌నం ప్ర‌ద‌ర్శించిన సాహ‌సం వ‌ల్లే.. ప్ర‌పంచ దేశాల‌కు ఆప‌రేష‌న్ సింధూర్ స‌క్సెస్ వినిపించింద‌ని చెప్పారు.
మ‌న‌ది గౌత‌మ బుద్ధుడు, గురు గోబింద్ సింగ్ పుట్టిన పుణ్య‌దేశ‌మ‌ని, మ‌న శ‌త్రువులు మ‌న సైనిక బ‌ల‌గాల‌ను మ‌రిచి మ‌న‌ల్ని స‌వాల్ చేశార‌ని ప్రధాని గుర్తు చేశారు. భార‌త్‌పై క‌న్ను వేస్తే నాశ‌నం త‌ప్ప‌ద‌ని.. ఉగ్ర‌వాదానికి ఊతం ఇచ్చే దేశాలు గ్ర‌హించాయ‌ని మోదీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీని మ‌న త్రివిధ ద‌ళాలు చావు దెబ్బ‌తీశాయ‌ని, శ‌త్రు దేశానికి దాని స్థానాన్ని చూపించాయ‌ని ఆయన కొనియాడారు.

మ‌న డ్రోన్లు, మిస్సైళ్లు చేసిన ఆప‌రేష‌న్‌ను చూసి.. పాకిస్థాన్‌కు చాలా కాలం నిద్ర ప‌ట్ట‌ద‌ని పేర్కొంటూ ఆప‌రేష‌న్ సింధూర్‌తో మ‌నం మ‌న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల్లో ఐక‌మ‌త్యం పెరిగింద‌ని చెబుతూ పాకిస్థాన్ లోప‌ల ఉన్న ఉగ్ర‌వాద కేంద్రాల‌ను ఐఏఎఫ్ టార్గెట్ చేసింద‌ని, చాలా వేగంగా, క‌చ్చిత‌త్వంతో ఆ దాడి జ‌రిగింద‌ని, శ‌త్ర దేశం ఆ దాడితో స్ట‌న్ అయ్యింద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

పాకిస్థాన్ విష‌యంలో మ‌న ల‌క్ష్మ‌ణ రేఖ క్లియ‌ర్‌గా ఉంద‌ని, ప్ర‌తి ఉగ్ర‌వాద దాడికి.. బ‌ల‌మైన రీతిలో రిప్లై ఉంటుంద‌ని ప్రధాని హెచ్చరించారు. ఉగ్ర‌వాదానికి అండ‌గా ఉన్న‌ గాఢ్‌ఫాద‌ర్‌ దేశాల‌ను, స్పాన్స‌ర్ దేశాల‌ను వేరుగా చూడ‌బోమ‌ని స్పష్టం చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్‌లోని ప్ర‌తి సంద‌ర్భం మ‌న సైనిక బ‌ల‌గాల శ‌క్తికి నిద‌ర్శ‌న‌మ‌ని తెలిపారు.  మన త్రివిధ ద‌ళాల ఆధిప‌త్యాన్ని చాటుతుంద‌ని పేర్కొంటూ  పాకిస్థాన్ మ‌న‌పై దాడి చేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నం చేసింద‌ని, కానీ మ‌న ఎయిర్‌బేస్‌లు, డిఫెన్స్ మౌళిక స‌దుపాయాలకు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌ధాని తెలిపారు.

ఆర్మీ, నేవీ, వైమానిక ద‌ళం మ‌ధ్య ఉన్న కోఆర్డినేష‌న్‌ను ప్ర‌ధాని మోదీ విశేషంగా మెచ్చుకున్నారు. త్రివిధ ద‌ళాలు మ‌ధ్య ప‌ర్ఫెక్ట్ కోఆర్డినేష‌న్ ఉంద‌న్నారు. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో మెషీన్ శ‌క్తిని , మాన‌వ స‌త్తాను అద్భుత‌మైన రీతిలో ప్ర‌ద‌ర్శించిన‌ట్లు మోదీ తెలిపారు. గ‌త ద‌శాబ్ధ కాలంలో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మైన ఆయుధ ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకున్నామ‌ని, టెక్నాల‌జీతో పాటు వ్యూహాల‌ను క‌లిపి మ‌న సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు చెప్పారు. 

కేవ‌లం ఆయుధాల‌తో దాడి చేయ‌బోలేమ‌ని, డ్రోన్లు.. డేటాతో కూడా దాడులు చేయ‌నున్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు. అన్ని స‌మ‌యాల్లో మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, కొత్త త‌ర‌హా భార‌త్‌తో డీల్ చేస్తున్నామ‌న్న విష‌యం మ‌న శ‌త్రువుకు తెలిసి ఉండాల‌ని చెప్పా రు. భార‌త్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుంద‌ని, ఒక‌వేళ శ‌త్రువు దాడి చేస్తే, అప్పుడు ప్ర‌తిదాడికి వెనుకాడ‌బోమ‌ని తేల్చి చెప్పారు.