యుద్ధమంటే రొమాంటిక్‌, బాలీవుడ్‌ సినిమా కాదు

యుద్ధమంటే రొమాంటిక్‌, బాలీవుడ్‌ సినిమా కాదు

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్న సమయంలో భారత సైన్యం మాజీ అధిపతి జనరల్‌ మనోజ్‌ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధమంటే రొమాంటిక్‌ వ్యవహారం కాదని, అదొక బాలీవుడ్‌ సినిమా అసలే కాదని స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

పుణెలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో నరవణె ప్రసంగిస్తూ  ”యుద్ధం లేదా హింస అనేవి మనం ఆశ్రయించాల్సిన చివరి మార్గాలు కావాలి. అవివేకులైన కొందరు మనపై యుద్ధాన్ని రుద్దినా, మనం దానిని ప్రోత్సహించకూడదు” అని స్పష్టం చేశారు.

పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారని చెబుతూ ”ఒక సైనికుడిగా, ఆదేశాలు వస్తే నేను యుద్ధానికి వెళతాను. కానీ, అది నా మొదటి ఎంపిక కాదు” అని జనరల్‌ నరవణె తేల్చి చెప్పారు. దౌత్యానికి, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవడానికే తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, సాయుధ పోరాటం వరకు పరిస్థితి రాకుండా చూడాలని కోరుకుంటానని తెలిపారు. 

సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా పిల్లలు పడే ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. ”షెల్లింగ్‌ జరిగినప్పుడు, రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి రావడం వంటి భయానక దృశ్యాలు చిన్నారుల మనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధ తరతరాలు వెంటాడుతుంది” అని చెప్పారు. 

“పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ) బారిన పడిన వారు, భయంకరమైన ఘటనలు చూసిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా చెమటలతో నిద్రలేచి, మానసిక చికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల మధ్యే కాకుండా, కుటుంబాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య కూడా విభేదాలను హింస ద్వారా కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ”జాతీయ భద్రతలో మనమందరం సమాన భాగస్వాములం. హింస దేనికీ సమాధానం కాదు” అని నరవణె ఉద్ఘాటించారు.