
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రత్యక్ష చర్చలకు తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వాలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు పుతిన్ ఆహ్వానించిన విషయాన్ని ఆయన నేరుగా ప్రస్తావించలేదు. కానీ ‘ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోంది’ అని పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ప్రపంచం మొత్తం ఇందుకోసమే ఎదురు చూస్తోందని తెలిపారు.
యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కొనసాగించడంలో కూడా అర్థం లేదని స్పష్టం చేశారు. రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామని, రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, శనివారం కీవ్‌లో పర్యటించిన ఫ్రాన్స్, యుూకే, జర్మనీ, పోలాండ్ నేతలు చేసిన సూచనతో 30 రోజుల బేషరతు కాల్పుల విరమణ పాటిస్తామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది. సోమవారం నుంచే అమల్లోకి తేవాలని రష్యాను కోరింది. ఈ కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సహా పలువురు ఐరోపా దేశాల అధినేతలు హెచ్చరిస్తున్నారు.
ఇదిలావుంటే ఉక్రెయిన్‌తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి తెర దించడానికి కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని తెలిపారు. మే ఈ చర్చలు రెండు దేశాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఇస్తాంబుల్ వేదికగా ఇరుదేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు.
అంతకుముందు, గురువారం ఇస్తాంబుల్ వేదికగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధికారులను పుతిన్ కోరారు. ఈ విషయంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడతానని చెప్పారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో కీవ్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ కూడా ప్రకటించామని చెప్పారు.
అయినప్పటికీ ఆ సమయాల్లో ఉక్రెయిన్ ఈ ఒప్పందాలను ఉల్లంఘించి 524 వైమానిక డ్రోన్‌లు, 45 సముద్ర డ్రోన్‌లు, అనేక పాశ్చాత్య క్షిపణులతో రష్యాపై దాడి చేసిందని ఆరోపణలు చేశారు. తమ సైన్యం ఉక్రెయిన్ దాడులను తిప్పి కొట్టిందని వెల్లడించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్