టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విరాట్ కోహ్లీ

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన విరాట్ కోహ్లీ

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెసట్​ క్రికెట్​కు రిటైర్​మెంట్​  ప్రకటించాడు. ఈమేరకు ఇన్‌స్టాలో సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్‌ చేశాడు. కింగ్​ కోహ్లీ 14 ఏళ్లపాటు భారత్‌ తరఫున టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 9,230 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీ, 

2011లో వెస్ట్‌ ఇండీస్‌తో అరంగేట్రం చేశాడు. కాగా, 3 జనవరి 2025న ఆస్ట్రేలియాతో విరాట్ కోహ్లీ చివరి టెస్టు ఆడాడు. టెస్టు ఫార్మాట్ త‌న‌కు ఎంతో నేర్పింద‌ని, త‌న‌ను ప‌రీక్షించింద‌ని, త‌త‌ను తీర్చిదిద్దింద‌ని, జీవితానికి కావాల్సిన ఎన్నో పాఠాలు నేర్పిన‌ట్లు కోహ్లీ పేర్కొన్నాడు. తెలుపు రంగు దుస్తుల్లో ఆడ‌డం ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని చెప్పారు. 

టెస్టు ఫార్మాట్‌ను వీడ‌డం సులువైన అంశం కాదు అని, కానీ స‌రైన స‌మ‌యం అని, ఆ ఫార్మాట్ ఎంతో చేశాన‌ని, త‌న‌కు కూడా ఎంతో క‌లిసి వ‌చ్చింద‌ని తెలిపారు. ఊహించిన‌దాని క‌న్నా ఎక్కువే లాభం జ‌రిగింద‌ని అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 68 మ్యాచ్‌ల‌కు అత‌ను కెప్టెన్‌గా చేశాడు. బ్యాటింగ్ స‌గ‌టు 46.85తో అత‌ను 9230 ర‌న్స్ చేశాడు. 

జూన్‌లో ఇంగ్లండ్‌తో అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో కోహ్లీ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజుల నుంచి కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. రోహిత్ త‌ర‌హాలోనే టెస్టు నుంచి త‌ప్పుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ్యాపించాయి. త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని కోహ్లీ బీసీసీఐకి చెప్పిన‌ట్లు కూడా తెలుస్తోంది.

వాస్త‌వానికి టెస్టు ఫార్మాట్‌లో కోహ్లీ పెద్ద‌గా ఫామ్‌లో లేడు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు సిరీస్ పెర్త్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ కొట్టాడు. సుమారు ఏడాది గ్యాప్ త‌ర్వాత అత‌ను ఆ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ ద‌శ‌లో టెస్టుల్లో కోహ్లీ యావ‌రేజ్ టాప్‌గా ఉండేది. టాప్ ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో కోహ్లీ టెస్టు యావ‌రేజ్ 55.10గా ఉంది. కానీ గ‌త 24 నెల‌ల్లో అత‌ను టెస్టు యావ‌రేజ్ 32.56కు ప‌డిపోయింది.

అనుభ‌వం దృష్ట్యా ఇంగ్లండ్ టూరుకు అవ‌స‌రం ఉన్నా కోహ్లీ త‌నంత‌టే తానే త‌ప్పుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కోహ్లీ 30 సెంచ‌రీలు, 31 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. సంప్ర‌దాయ క్రికెట‌ర్ల త‌ర‌హాలో కాకుండా చాలా ధైర్య‌వంతుడి త‌ర‌హాలో అత‌ను టెస్టు క్రికెట్‌ను ఆడాడు. స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత ఇండియ‌న్ క్రికెట్‌లో ప్ర‌భావంత‌మైన బ్యాట‌ర్‌గా కింగ్ కోహ్లీ పేరు తెచ్చుకున్నాడు. 

భార‌త జ‌ట్టు టెస్టు పోక‌డ‌నే మార్చేశాడ‌త‌ను. భార‌తీయ క్రికెట‌ర్ల సైకాల‌జీపై ప్ర‌భావాన్ని చూపిన క్రికెట‌ర్‌గా కోహ్లీ నిలుస్తాడు.  ఒక‌ప్పుడు భార‌త క్రికెట‌ర్లు ఎక్కువగా టెక్నిక‌ల్ స్కిల్‌తో మాత్ర‌మే ఆడేవారు. వారిలో కొంత ఆత్మ‌నూన్య‌త ఉండేది. కానీ కోహ్లీ ఎంట్రీతో టెస్టు క్రికెట్‌లో ఇండియన్ గేమ్ స్ట‌యిల్ మారిపోయింది.  గంగూలీ, ధోనీ కెప్టెన్లుగా త‌మ‌దైన స్ట‌యిల్‌లో రాణించగా, కోహ్లీ మాత్రం అగ్నిశిఖ‌లాగా భార‌తీయ టెస్టు క్రికెట్‌లో జోష్‌ను పెంచేశాడు. 

విదేశీ పిచ్‌ల‌పై విరుచుకుప‌డే ఆట‌ను అత‌ను ప్ర‌ద‌ర్శించాడు. విదేశీ గ‌డ్డ‌ల‌పై కూడా ఈజీగా గెల‌వ‌వ‌చ్చు అని నిరూపించాడు.  విదేశీ పిచ్‌ల‌పై ఇండియాను ఆధిప‌త్య ప‌థంలో న‌డిపాడు కోహ్లీ. స‌చిన్ త‌ర్వాత విదేశీ పిచ్‌ల‌పై రాణించిన మేటి బ్యాట‌ర్‌గా కోహ్లీ అగ్ర‌ప‌థంలో ఉన్నాడు. ప్రొఫెష‌న‌ల్ క్రికెట్‌కు ప్ర‌త్యామ్నాయంగా కోహ్లీ నిలిచాడు. శారీర‌కంగా అత‌ను ఫిట్‌నెస్ అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. మాన‌సికంగా కూడా అత‌ను ఓ ఇనుప ఖ‌నిజం అన్న రీతిలో మైదానంలో ఉండేవాడు. 

ఇండియ‌న్ టెస్టు క్రికెట్‌లో స‌చిన్ టెండూల్క‌ర్ ఓ జీనియ‌స్, ధోనీ ఓ వ్యూహాక‌ర్త‌, ఆ రేంజ్‌లోనే కోహ్లీ భార‌తీయ క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ప్ర‌భావంత‌మైన బ్యాట‌ర్‌గా నిలిచిపోయాడు. క్రికెట్ ఫ‌లితాల‌నే కాదు.. క్రికెట‌ర్ల మైండ్‌సెట్‌ను కూడా అత‌ను మార్చేశాడు.