ఆక్రమిత కాశ్మీర్ అప్పగింతపై మొదటిసారి భారత్ పట్టు!

ఆక్రమిత కాశ్మీర్ అప్పగింతపై మొదటిసారి భారత్ పట్టు!
కాల్పుల విరమణ అనంతరం సహితం ఇంకా `ఆపరేషన్ సిందూర్’ ముగియలేదని అంటూ భారత సైనికాధికారులు చేస్తున్న ప్రకటనల సారాంశం ఆక్రమిత కాశ్మీర్ అప్పగింత కోసం పాకిస్తాన్ పై వత్తిడి తీసుకు రావడంగా స్పష్టం అవుతుంది. మొదటిసారి, ఈ అంశాన్ని పాకిస్థాన్తో జరిగే చర్చలలో భారత్ ప్రముఖంగా ప్రస్తావించేందుకు సిద్ధపడుతున్నది. “ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు. కశ్మీర్‌పై స్పష్టమైన వైఖరితో ఉన్నాం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను అప్పగించడంపై తప్ప మరో దానిపై చర్చించేది లేదు. పీవోకేని అప్పగించడమే మిగిలి ఉంది” అని సైనిక వర్గాలు పేర్కొనడం ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.

ఇప్పటి వరకు పాకిస్థాన్ తో సాధారణ సంబంధాల పునరుద్దరణకు భారత్ ప్రముఖంగా ఆ దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంగా ప్రస్తావిస్తూ వస్తున్నది. భారత్ లో ఉగ్రదాడులు పాల్పడి, పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని, వారికి వనరులు సమకూర్చడాన్ని పాకిస్తాన్ నిలిపివేయాలని పట్టుబడుతూ వస్తున్నది.

కానీ, భారత్ మొదటిసారిగా ఉగ్రవాదం తమ మొదటి ప్రాధాన్యత కాదని పేర్కొనడంతో పాటు ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేయడం కీలక అంశం అని భారత్ స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. “ఉగ్రవాదుల విషయంలో వాళ్లు మాట్లాడితే మేమూ మాట్లాడతాం. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదు” అంటూ విదేశాంగ శాఖ పేర్కొనడం గమనార్హం.

ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ తో పాటు, ఆక్రమిత కాశ్మీర్ లో నెలకొన్న ప్రముఖ ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చారు. దానితో పాకిస్థాన్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను, మూలలను ధ్వంసం చేయడంలో తమకు తామే వ్యవహరింపగలమనే భరోసా భారత ప్రభుత్వంలో ఇప్పుడు వెల్లడవుతుంది.

కాల్పుల విరమణ అనంతరం సోమవారం మధ్యాన్నం రెండు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ మిలటరీ ఆఫరేషన్స్‌ (డీజీఎంవో)ల మధ్య జరుగనున్న హాట్‌లైన్‌ చర్చల ఎజెండా గురించి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ, భారత విదేశాంగ శాఖ మాత్రం పీవోకేనే కీలకమని చెబుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే ఇక పాకిస్థాన్ తో చర్చలు ఉంటాయని, ఇతర అంశాలపై చర్చలపై ఆసక్తి లేదని భారత వైఖరి స్పష్టంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.

కాశ్మీర్‌ విషయంలో భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉందని, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను అప్పగించడం మినహా చర్చలలో మరో ప్రధాన విషయం ఏమీ ఉండదని తెలిపింది. అంతకు మించి మాట్లాడేది లేదని పేర్కొంది.  కాశ్మీర్ అంశంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య కోరుకొంటే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత్ వ్యూహాత్మకంగా ఆక్రమిత కాశ్మీర్ అంశంవైపు మళ్లించింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై మధ్యవర్తులు అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పడం ద్వారా పాకిస్తాన్ ఇక కాశ్మీర్ అంశం ప్రస్తావింప దాలిస్తే ఆక్రమిత కాశ్మీర్ అంశమే అవుతుందనే సంకేతం ఇచ్చారు.  పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం మినహా పాకిస్థాన్‌కు మరో మార్గం లేదని తేల్చి చెబుతూ కాశ్మీర్‌ విషయంలో ఇంతకుమించి మాట్లాడేదేమీ లేదని ప్రధాని సుస్పష్టం చేశారు. వా

స్తవానికి పహల్గమ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతిస్పందన ఆక్రమిత కాశ్మీర్ ను ఆక్రమించుకోవడమే కాగలదని అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి.  ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ డ్రోన్ లు, క్షిపణులతో ప్రారంభించిన దాడులను తిప్పికొట్టడమే కాకుండా, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై సహితం భారత్ దాడులు ప్రారంభించడం, పాకిస్థాన్ ఆత్మరక్షణలో పడటంతో ఒకటి, రెండు రోజులలోనే ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వాధీనం కాగలదని అంచనాలు దేశంలో పెద్ద ఎత్తున బయలుదేరాయి. కానీ అంతలో బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటన రావడంతో చాలామంది నిరాశ చెందారు.