జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు జరుగని మొదటి రాత్రి

జమ్మూ కశ్మీర్‌లో కాల్పులు జరుగని మొదటి రాత్రి
 
* తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు
 
భారత్ – పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు చెలరేగిన తర్వాత మొదటిసారిగా  జమ్మూ కశ్మీర్‌లో గత రాత్రి కాల్పులు జరుగలేదని భారత సైన్యం ప్రకటించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రశాంతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదని సైన్యం పేర్కొంది.
 
ఉద్రిక్తల కారణంగా సరిహద్దు రాష్ట్రాలలో మూసివేసిన 32 విమానాశ్రయాలను సోమవారం ప్రారంభించారు. వైమానిక దళం సూచనపై విమానాశ్రయాలను తెరవాలని భారత ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. మే 9న శ్రీనగర్, చండీఘర్, అమృతసర్ లతో సహా 15 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు. దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో సాధారణ పరిస్థితి నెలకొన్నప్పటికీ కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని, సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియలో జాప్యం జరగవచ్చని అధికారులు తెలిపారు.
 
ఇటీవల రోజుల్లో తొలిసారిగా రాత్రి వేళ శ్రీనగర్ లో ప్రశాంతమైన వాతావరణం కనిపించిందని చెప్పింది. ఇదిలా ఉండగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరుదేశాల జీడీఎంవోలు హాట్‌లైన్‌లో చర్చలు జరుపనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 10న ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన జరిగిన విషయం తెలిసిందే. 
 
అవగాహన ఉల్లంఘనలపై పాక్‌ డీజీఎంవోకు హాట్‌లైన్‌లో భారత్‌ సందేశం పంపింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తే తగిన రీతిలో జవాబిస్తామని హెచ్చరించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రదాడికి పాకిస్తాన్‌లో ఉగ్రమూకలే కారణమని భారత్‌ గుర్తించింది. 
 
ఈ క్రమంలో మే 7న భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించింది. పాక్‌, పీవోకేఈలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత భారత్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్‌ డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దాంతో భారత సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే.