పుల్వామా దాడి మా పనే.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్‌

పుల్వామా దాడి మా పనే.. ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్‌
2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడి వెనుక తమ హస్తం ఉందని మీడియా సాక్షిగా మొదటిసారిగా పాకిస్తాన్ అంగీకరించింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పాక్‌కు చెందిన వాయుసేన ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఔరంగజేబ్‌ అహ్మద్‌ ఒప్పుకున్నారు.
 
“పుల్వామాలో మా వ్యూహాత్మక ప్రతిభ ద్వారా మేము దానిని సాధించడానికి ప్రయత్నించాము. ఇప్పుడు, మేము మా కార్యాచరణ పురోగతిని,  వ్యూహాత్మక సామర్థ్యాన్ని చూపించాము. వారు వినాలని నేను భావిస్తున్నాను” అని అహ్మద్ పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశానికి తమ సైన్యం పట్ల ఉన్న గర్వం, విశ్వాసం తాము ఎల్లప్పుడూ, ఏ ధరకైనా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

“పాకిస్థాన్ జలాలు, భూభాగం, గగనతలానికి, ప్రజలకు ఎవరైనా ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తే తాము సహించబోం. అలాంటి చర్యల్ని ఎన్నటికీ ఉపేక్షించబోం. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడం. దేశ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా పుల్వామా దాడితో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం” అని వ్యాఖ్యానించారు. 

 
ఈ మీడియా సమావేశంలో ఔరంగజేబ్ అహ్మద్‌తోపాటు లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ, నేవీ అధికార ప్రతినిధి కూడా పాల్గొన్నారు. ఔరంగజేబ్‌ వ్యాఖ్యలతో పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న విషయం మరోసారి బట్టబయలైంది. 2019 ఫిబ్రవరి 14 న పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. 
 
దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు, అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)ను దాటి పాకిస్థాన్‌ వైపున ఉన్న బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్  చేసింది.

పాకిస్తాన్ ఈశాన్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తున్ఖ్వా తీవ్రవాదుల అడ్డాను తునాతునకలు చేశారు. ఈ సర్జికల్‌ స్ట్రైక్‌లో చాలా మంది ముష్కరులు చనిపోయినప్పటికీ పాకిస్థాన్‌ మిన్నకుండి పోయింది. మరుసటి రోజు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం పాకిస్థాన్‌ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 కూల్చివేసింది. 

పాకిస్థాన్ కూడా మన మిగ్-21 విమానాన్ని కూల్చివేసి, వింగ్ కమాండర్ అభినందన్‌ను అరెస్టు చేసింది. అయితే మూడు వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్‌ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత అభినందన్‌ను క్షేమంగా భారత్‌కు అప్పగించింది.