ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు
 
* 100 గంటల పాటు దాడులు.. 100 మంది ఉగ్రవాదుల హతం
 
ఆపరేషన్‌ సిందూర్‌లో తమకు అప్పగించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేశామని భారతవైమానిక దళం (ఐఎఎఫ్‌) ప్రకటించింద అయితే, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదంటూ భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగుతోందని ఐఎఎఫ్‌ ఆదివారం ఎక్స్‌లో పేర్కొంది.  ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళానికి అప్పగించిన పనులను పూర్తి ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో విజయవంతంగా అమలు చేశామని ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్‌లో వెల్లడించింది.
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, ఉద్దేశపూర్వకంగా, వివేకంతో కార్యకలాపాలు నిర్వహించామని తెలిపింది.  ఈ ఆపరేషన్ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నందున, తగిన సమయంలో కంప్లీట్ బ్రీఫింగ్ ఇస్తామని పేర్కొంది ఐఏఎఫ్.  ఊహాగానాలు, తప్పుడు వార్తల వ్యాప్తికి దూరంగా ఉండాలని ఈసందర్భంగా అందరినీ కోరుతున్నట్లు ఐఎఎఫ్‌ ఎక్స్‌లో  ప్రజలను విజ్ఞప్తి చేసింది.
 
కాగా, పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్‌ చేపట్టిన సైనిక దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సుమారు 100 గంటల పాటు డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగాయి. మే 7 తెల్లవారుజామున 1 గంట సమయంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో వైమానిక దాడులను భారత్‌ ప్రారంభించింది. పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేశాయి. త్రివిధ దళాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

కాగా, మే 7న భారత్‌ జరిపిన దాడులపై పాక్‌ ప్రతిస్పందించింది. మే 7 అర్ధరాత్రి నుంచి మే 8 గురువారం తెల్లజాము వరకు సరిహద్దుల్లో కాల్పులతోపాటు 15 నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో పాక్‌ దాడులకు పాల్పడింది. అయితే ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో పాక్‌ డ్రోన్లు, క్షిపణులను భారత్‌ కూల్చివేసింది. మరోవైపు మే 8 రాత్రి నుంచి మే 9 శుక్రవారం తెల్లవారుజాము వరకు జమ్ముకశ్మీర్‌తోపాటు రాజస్థాన్‌, పంజాబ్‌లోని 36 సరిహద్దు ప్రాంతాల్లో 300 నుంచి 400 టర్కీ డ్రోన్లను పాక్‌ ప్రయోగించింది. భారత్‌ సమర్థవంతంగా వీటిని నిర్వీర్యం చేసింది. పాక్‌ దాడులు మే 10 వరకు కొనసాగాయి. 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌పై శనివారం ఉదయం 5 గంటలకు, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌పై మధ్యాహ్నం 1 గంట వరకు డ్రోన్లతో పాక్‌ దాడులు చేయగా భారత సైన్యం తిప్పికొట్టింది. ఇక మే10న పాక్‌లోని ఎయిర్‌ బేస్‌లతో సహా 8 కీలక సైనిక స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. దీంతో భారత్‌ దాడుల ధాటికి పాక్‌ తోకముడిచింది.  మే 7 నుంచి 10 వరకు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సుమారు వంద గంటలపాటు డ్రోన్‌, క్షిపణి దాడులు జరిగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.