కాల్పుల విరమణపై  పాక్ ను నమ్మ వద్దంటున్న నేతలు

కాల్పుల విరమణపై  పాక్ ను నమ్మ వద్దంటున్న నేతలు

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా సరే  పాకిస్థాన్ ను మాత్రం నమ్మొద్దని పలువరు భారత రాజకీయ నేతలు అభిప్రాయపడ్డారు. పాక్ ను ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.  భారత్, పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్  ఒక ప్రకటనలో కోరింది.

గత 18 రోజుల ఘటనలను చర్చించడానికి ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీ కూడా అయిన కాంగ్రెస్ డిమాండ్ చేసింది. “వాషింగ్టన్ డిసి నుండి అపూర్వమైన స్టేట్ మెంట్ దృష్ట్యా, ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించి రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉంది” అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

కాల్పుల విరమణను స్వాగతిస్తూనే, అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సూచించారు. “భారత్, పాకిస్థాన్ రెండూ అంగీకరిస్తే మంచిదే. అయితే, మనం అప్రమత్తంగా ఉండాలి… కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలి” అని చెప్పారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ, నిఘా అవసరాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నొక్కిచెప్పారు. “కాల్పుల విరమణ ప్రకటించడం శుభవార్త, కానీ పంజాబ్ అప్రమత్తంగా ఉంటుంది. మా అంతర్జాతీయ సరిహద్దులో యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు.

 కాల్పుల విరమణ అత్యవసరమైనదని, ఆలస్యంగా జరిగిందని కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్  అభివర్ణించారు. “శాంతి అత్యవసరం… నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పడానికే భారత్ యుద్ధం చేసింది, ఆ గుణపాఠం చెప్పబడింది” అని చెప్పారు. కాల్పుల విరమణను స్వాగతిస్తూ, ఇది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకు దారితీయాలని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పష్టం చేశారు. 

 “కాల్పుల విరమణను నేను స్వాగతిస్తున్నాను, ఇరుపక్షాలను అభినందిస్తున్నాను. ఇప్పుడు యుద్ధంతో సంబంధం లేని అమాయకుల ప్రాణనష్టం చూడము… వారు (పాకిస్తాన్) దీనిని ఆపి, ఈ ఉగ్రవాద శిబిరాలను తొలగించి, అవి ఈ దేశంలో ఉగ్రవాదానికి కేంద్రాలుగా మారకుండా చూడాలి. అది కొనసాగినంత కాలం, ఈ సంఘర్షణ కొనసాగుతుంది, తాత్కాలిక కాల్పుల విరమణ ఎప్పటికీ శాశ్వతం కాదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.