ఎప్పుడూ పాకిస్థాన్‌కు అండగా చైనా

ఎప్పుడూ పాకిస్థాన్‌కు అండగా చైనా
ఒకవంక, కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తూ ఉంటే, మరోవంక దానికి చైనా వత్తాసు పలుకుతోంది. పాకిస్తాన్​ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు, ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్​ దార్​తో ఫోన్​లో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ మేరకు హామీ ఇచ్చారు.

ఫోన్​ సంభాషణలో ప్రస్తుతం భారత్​- పాక్​ల మధ్య నెలకొన్న పరిస్థితులను వాంగ్​ యీకు ఇషాక్​ దార్ వివరించినట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం తెలిపింది. సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ చాలా సంయమనంతో ఉందని, చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని వాంగ్​ యీ కొనియాడారు.  చైనా-పాక్‌ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణపై చైనా విదేశాంగ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.  

దీనిపై వాంగ్‌ యీ స్పందిస్తూ, ‘పాక్‌-చైనా స్నేహం ఉక్కు కవచం లాంటిది. చైనాకు పాక్‌ వ్యూహాత్మక భాగస్వామి. ప్రాదేశిక సమగ్రత, స్వతంత్రత, తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవటంలో పాక్‌కు చైనా అండగా నిలుస్తుంది’ అని భరోసా ఇచ్చారు.  తమ మిత్రదేశమైన పాకిస్థాన్​కు చైనా అన్నివేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామిగా ఉంటుందని, తమ స్నేహ బంధం విడదీయరానిదని వాంగ్ యీ పేర్కొన్నారు.

మరోవైపు ఇషాక్​ దార్​, యూఏఈ డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్​తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్-పాక్​లు కాల్పుల విరమణకు అంగీకరించడానికి అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అలాగే తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్‌తో మాట్లాడిన ఇషాక్​ దార్ ప్రస్తుతం భారత్​-పాక్​ల మధ్య నెలకొన్న పరిస్థితులను వివరించారు.