పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంఒ) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత డిజిఎంఒకు ఫోన్ చేశారని ఆయన తెలిపారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.
ఆ మేరకు రెండు దేశాలు తమ సైనిక దళాలకు సందేశం పంపామని, తిరిగి రెండు దేశాల మధ్య ఈ నెల 12న మధ్యాన్నం 12 గంటలకు చర్చలు జరగనున్నాయని ఆయన చెప్పారు. అయితే అందుకు ఎటువంటి షరతులు లేవని స్పష్టం చేశారు.
అంతకుముందు, న్యూఢిల్లీ, పాకిస్థాన్ , “పూర్తి, తక్షణ” కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌ని ఉద్దేశించి ట్రంప్ ఇలా పోస్ట్ చేశారు: “అమెరికా మధ్యవర్తిత్వం వహించిన సుదీర్ఘ రాత్రి చర్చల తర్వాత, భారతదేశం, పాకిస్తాన్ పూర్తి, తక్షణ ఒప్పందానికి అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను” అని ప్రకటించారు.
ఇరు దేశాల అధినేతలతో గత రాత్రి అంతా చర్చలు జరిపామని, ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు విజ్ఞతతో వ్యవహరించి కాల్పుల విరమణకు అంగీకరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుందని ట్రంప్ చెప్పారు. శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాల అధినేతలకు ట్రంప్ అభినందనలు తెలిపారు.
తర్వాత కొద్దీ నిమిషాల్లో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇలా పేర్కొన్నారు: “పాకిస్తాన్, భారతదేశం తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్తాన్ ఎల్లప్పుడూ తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండా ఈ ప్రాంతంలో శాంతి, భద్రత కోసం కృషి చేసింది, !”
“భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు ఆపడం, సైనిక చర్యపై ఒక అవగాహనను కుదుర్చుకున్నాయి” అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. “ఉగ్రవాదపు అన్ని రూపాలు, వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా భారతదేశం స్థిరంగా దృఢమైన, రాజీలేని వైఖరిని కొనసాగించింది. అది అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏకంగా 26 మంది పర్యాటకులను కాల్చిచంపడాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులేనని తేలడంతో భారత్ రగిలిపోయింది. పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్స్ స్ట్రైక్స్ చేస్తోంది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్వింపులకు పాల్పడుతోంది. వాటిని భారత్ సేనలు సమర్ధవంతంగా తిప్పికొడుతూ ఉండడంతో పూర్తిస్థాయి యుద్ధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్న సమయంలో ఈ కాల్పుల విరమణ జరగడం గమనార్హం.

More Stories
పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు
ఉగ్రకుట్రకు అడ్డాగా అల్ ఫలాహ్లో 17వ నంబర్ భవనం
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు