
* దేశంలోని కార్మికులకు బిఎంఎస్ పిలుపు
ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన భారత సాయుధ దళాలను అభినందిస్తూ, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న భారత వ్యతిరేక ఉగ్రవాద శక్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం దృఢ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ సమర్థవంతంగా ప్రదర్శించిందని దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) ప్రశంసించింది. భారత సాయుధ దళాలకు చెందిన సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలని అభినందించింది.
అధ్యక్షుడు హిరణ్మయ్ పాండ్య అధ్యక్షతన జరిగిన కేంద్రీయ కార్యసమితి సమావేశంలో ఆమోదించిన ఓ తీర్మానంలో దేశభక్తి భావాలను ప్రత్యక్ష చర్యలుగా అనువదించడానికి ఇదే సరైన సమయం అని పేర్కొంటూ ఈ సమయంలో అన్ని రకాల సమ్మెలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, ఇతర రకాల ట్రేడ్ యూనియన్ చర్యలను వాయిదా వేయమని అనుబంధ కార్మిక సంఘాలకు పిలుపిచ్చారు. అవసరమైతే, అదనపు సమయం పని చేయాలని, అదనపు సమయం ఛార్జీలు తీసుకోకుండా ఉత్పాదకతను పెంచాలని సూచించారు.
ఆ మేరకు ఉత్తర జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పవన్ కుమార్ ప్రతిపాదించిన, 13 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శులు బలపరిచిన ఓ తీర్మానం ద్వారా అనుబంధ సంఘాలు, సమాఖ్యలు, రాష్ట్ర యూనిట్లకు పిలుపిచ్చారు. యుద్ధం లాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులు, సాధారణ ప్రజలలో అవగాహన పెంచాలని, భారత రక్షణ దళాలకు అవసరమైన అన్ని సహాయాన్ని అందించాలని సూచించారు.
పౌర రక్షణ పనులు, రక్తదాన కార్యక్రమాలు, స్థానిక రవాణా, ఇతర సంబంధిత కార్యక్రమాలలో జిల్లా అధికారులతో సహకరించాలని థెయ్ల్పారు. జిల్లా, పరిశ్రమ స్థాయిలలో భారత సాయుధ దళాలకు మద్దతు ఇచ్చే సంఘీభావ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కాగా, ఉద్యోగులందరూ ఈ సమయంలో తప్పనిసరిగా సెలవు తీసుకోకుండా ఉండాలని కోరుతూ, ఇప్పటికే సెలవులో ఉన్నట్లయితే వెంటనే రద్దు చేసుకొని తమ విధులలో చేరాలని పిలుపిచ్చింది.
ముఖ్యంగా, రక్షణ, రైల్వేలు, పౌర విమానయానం, టెలికమ్యూనికేషన్, ఆరోగ్యం, విద్యుత్, శాస్త్రీయ సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అంతరిక్ష ఉద్యోగులు, రోడ్డు రవాణా, ఇతర విభాగాలు సహా కీలక రంగాలకు చెందిన వారు రక్షణ దళాలకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తు చేశారు.
కాగా, 1962, 1965, 1971 యుద్ధాల సమయంలో స్థాపించిన “రాష్ట్రీయ మజ్దూర్ మోర్చా”ను పునరుద్ధరించడానికి వివిధ స్థాయిలలోని ఇతర సారూప్య జాతీయవాద కార్మిక సంఘాలను సంప్రదించాలని బిఎంఎస్ నిర్ణయించింద. ఈ ప్రయత్నాలలో ప్రభుత్వానికి తిరుగులేని మద్దతును అందించాలని, ఈ క్లిష్టమైన సమయంలో దేశం మన వీర సైనికులతో ఐక్యంగా నిలబడాలని భావించింది.
1962, 1965, 1971 యుద్ధాలు, కార్గిల్ యుద్ధం సమయంలో, బిఎంఎస్ అటువంటి వైఖరిని తీసుకొని, థన్ అచంచలమైన జాతీయ నిబద్ధతను ప్రదర్శించిందని గుర్తు చేసింది. విదేశీ దురాక్రమణకు వ్యతిరేకంగా మనం మరోసారి ఒక దేశంగా ఐక్యంగా ఉండాలని పిలుపిచ్చింది.
కాగా, నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకున్నందుకు, రాజీ లేకుండా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అచంచలమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి బిఎంఎస్ కృతజ్ఞతలు తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యూహాత్మక చతురతతో రక్షణ దళాలను నడిపించగా, హోంమంత్రి అమిత్ షా అంతర్గత భద్రతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అభినందించింది.
ఈ ముగ్గురు నాయకుల సమిష్టి ప్రయత్నాలు, దార్శనికత జాతీయ కీర్తిని తెచ్చిపెట్టాయి మరియు సాధారణ ప్రజలలో విశ్వాసాన్ని కలిగించాయని బిఎంఎస్ కొనియాడింది. పాకిస్తాన్ నిస్సహాయ వ్యూహాలను బిఎంఎస్ తీవ్రంగా ఖండించింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పూచ్, కుప్వాడ జిల్లాల్లోని పౌర నివాస ప్రాంతాలపై పాకిస్తాన్ దళాలు భారీ షెల్లింగ్కు పాల్పడడంతో పాటు సరిహద్దు రాష్ట్రాలలోని 15 ప్రధాన, జనసాంద్రత కలిగిన భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది.
కానీ భారత దళాలు ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని కొనియాడుతూ పాకిస్తాన్ యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టిస్తోందని బిఎంఎస్ ఆరోపించింది. పాకిస్తాన్ దుష్ట కుట్రలను సమావేశం తీవ్రంగా ఖండించింది. “ఆపరేషన్ టోపాక్”, కార్గిల్ వివాదంతో సహా దాని కుట్రలను భారత సైన్యం మొత్తం దేశం తిరుగులేని మద్దతుతో విజయవంతంగా తటస్థీకరించిందని ఈ సందర్భంగా పాకిస్తాన్కు గుర్తు చేసింది.
ఇండో-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ తరుణంలో, భారత ప్రభుత్వం, భారత సాయుధ దళాలకు దృఢంగా నిలబడాలని బిఎంఎస్ నిర్ణయించింది. పాకిస్తాన్ దురాక్రమణను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం అమలు చేసే వివిధ చర్యలకు కూడా మద్దతు తెలిపింది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం