టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్ శర్మ

టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్ శర్మ

ఇటీవల కొంతకాలంగా ఫామ్‌ లేమితో ఇబ్బందులుపడుతున్న హిట్‌మ్యాచ్‌ భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చివరకు టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌ ఇకపై వన్డేల్లో కొనసాగనున్నాడు. జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ వరకు బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను ప్రకటించనున్నది. భారత జట్టు విజయవంతమైన కెప్టెన్‌ రోహిత్‌ ఒకడు. రోహిత్‌ శర్మ 67 టెస్ట్ మ్యాచ్‌ల్లో 40.57 సగటుతో 4301 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్‌స్టా స్టోరీలో తన టెస్ట్ క్యాప్ చిత్రాన్ని షేర్‌ చేశాడు. “నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫార్మాట్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వకారణం. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. వన్డేల్లో భారత్‌ తరఫున ఆడటం కొనసాగిస్తాను” అని వెల్లడించాడు.

గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత విరాట్‌తో కలిసి రోహిత్‌ శర్మ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించడం ద్వారా భారతదేశం ఈ టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టును రెండోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను సాధించడంలో జట్టును ముందుండి నడిపించిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టీ20 రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

38 సంవత్సరాల రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత జట్టు కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్నది. జస్ప్రీత్‌ బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ కెప్టెన్సీ రేసులో ముందున్నారు. ఈ సిరీస్‌ జూన్‌లో మొదలై ఆగస్టు వరకు కొనసాగనున్నది. ఆతిథ్య జట్టుతో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనున్నది. 2024-25 సీజన్‌లో రోహిత్‌ ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. 15 మ్యాచుల్లో 10.83 సగటుతో కేవలం 164 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరిగిన టెస్టుల్లో ఇబ్బందిపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ టెస్ట్‌ సిరీస్‌లోనూ చెత్త ఆటతో విమర్శల పాలయ్యాడు.  తొలి మ్యాచ్‌కు దూరమైనా రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చినా ఓపెనర్‌గా రాకపోవడంతో యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌తో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. రోహిత్ గైర్హాజరీలో యశస్వి, రాహుల్ జోడీ తొలి మొదటి టెస్ట్‌లో 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 

రెండో టెస్టులో రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా ఇబ్బందిపడుతూ కనిపించాడు. బ్రిస్బేన్‌లో జరిగిన మూడవ టెస్ట్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత రోహిత్ టాప్ ఆర్డర్‌లోకి తిరిగి వచ్చాడు. టాప్‌ ఆర్డర్‌లోనూ విఫలమయ్యాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో మూడు, తొమ్మిది పరుగులు మాత్రమే చేయగా నాల్గో టెస్టులో శుభ్‌మాన్ గిల్‌ని పక్కన పెట్టారు. ఐదో టెస్టు రోహిత్‌ దూరమైన విషయం తెలిసిందే.