సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలం పొడగింపు

సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలం పొడగింపు
కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ పదవీకాలాన్ని పొడిగించింది. మరో ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సీబీఐ కొత్త డైరెక్టర్‌ నియామకం కోసం సమావేశం జరిగిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ కన్నా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. 

తాజాగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించగా, ఈ మేరకు డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్‌ సూద్‌ 25 మే 2023న రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చారు. ఆయన ఈ పదవిలో మే 2026 వరకు కొనసాగుతారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్‌కు చెందిన కర్నాటక కేడర్‌ ఐపీఎస్‌

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించక ముందు కర్ణాటక డీజీపీగా పని చేశారు. ప్రవీణ్‌ సూద్‌ 1964లో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో జన్మించారు. 22 సంవత్సరాల వయసులో ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), న్యూయార్క్‌లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోని మాక్స్‌వెల్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఆయన అనేక ఉన్నత స్థాయి కేసుల దర్యాప్తును పర్యవేక్షించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సూద్ కర్ణాటకలోని క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్, ఇంటర్‌ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్‌ను బలోపేతం చేసేందుకు న్యాయవ్యవస్థతో కలిసి పని చేశారు.