ప్ర‌తిదాడి చేసే హ‌క్కును వినియోగించుకున్నాం

ప్ర‌తిదాడి చేసే హ‌క్కును వినియోగించుకున్నాం

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి కార‌ణ‌మై వారిని మ‌న ఇంటెలిజెన్స్ గుర్తించింద‌ని, ఆ ఉగ్ర‌మూక‌ల్ని టార్గెట్ చేసిన‌ట్లు  విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిశ్రి వెల్ల‌డించారు. ఉగ్ర స్థావ‌రాల‌ను గుర్తించి, ఉగ్ర‌వాదుల్ని రూపుమాపాని ఆయ‌న పేర్కొన్నారు. విక్ర‌మ్ మిశ్రి మీడియా స‌మావేశంలో క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి, వింగ్ క‌మాండ‌ర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. 

జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ప్ర‌గ‌తి, అభివృద్ధిని ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశార‌ని ఆయ‌న చెప్పారు. పెహ‌ల్గామ్ దాడి ప‌ట్ల జ‌మ్మూక‌శ్మీర్‌తో పాటు యావ‌త్ దేశ ప్ర‌జ‌ల్లో స‌హ‌జంగా ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింద‌ని పేర్కొన్నారు. ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసే హ‌క్కును ఇండియా వినియోగించుకున్న‌ట్లు చెప్పారు. పెహ‌ల్గామ్ దాడితో కావాల‌నే కుటుంబ‌స‌భ్యుల్ని వేద‌న‌కు గురి చేశార‌ని తెలిపారు. 
 
జమ్మూక‌శ్మీర్‌లో మ‌త ఉద్రిక్త‌లు క‌లిగించే రీతిలో పెహ‌ల్గామ్ దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. “పహల్గాం ఘటనలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్ర మూకలకు పాకిస్థాన్‌ అండగా నిలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనక టీఆర్‌ఎఫ్‌ ఉంది. టీఆర్‌ఎఫ్‌కు పాకిస్థాన్‌ అండదండలున్నాయి. లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌పై ఇప్పటికే నిషేధం ఉంది” అని తెలిపారు. 
 
“ఉగ్ర సంస్థలపై నిషేధం దృష్ట్యా టీఆర్‌ఎఫ్‌ పేరుతో కార్యకలాపాలు. టీఆర్‌ఎఫ్‌ వెనక ఉన్నది లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలే. జమ్ముకశ్మీర్‌ను అతలాకుతలం చేయడమే లక్ష్యంగా పహల్గాం దాడి. కొంతకాలంగా కశ్మీర్‌లో పర్యాటకం వృద్ధి చెందుతోంది. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకే పహల్గాం దాడి. పహల్గాంలో అతి క్రూరంగా ఉగ్రదాడి జరిగింది” అని పేర్కొన్నారు.
 
“కుటుంబసభ్యుల కళ్ల ముందే కిరాతకంగా చంపారు. టీఆర్‌ఎఫ్‌ గురించి ఇప్పటికే ఐరాసకు ఫిర్యాదు చేశాం. ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్‌ చరిత్ర ప్రపంచానికి తెలిసిందే. ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం” అని విక్రమ్​ మిస్రీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్లిన సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ చీఫ్‌లకు  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. షా ఆదేశాలతో పాక్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.