బలుచిస్థాన్‌లో బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికుల మృతి

బలుచిస్థాన్‌లో  బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికుల మృతి

బలుచిస్థాన్‌లో మంగళవారం జరిగిన బాంబు దాడిలో ఏడుగురు పాక్ పారామిలిటరీ సైనికులు మరణించారు. గాయపడ్డ ఐదుగురు సైనికులను అధికారులు మిలటరీ ఆసుపత్రికి తరలించారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఈ దాడి చేశారని పాక్ మిలిటరీ ఓ ప్రకటన విడుదల చేసింది. కచ్చి జిల్లా వద్ద పారామిలిటరీ దళాలు ప్రయాణిస్తున్న వాహనాలపై నాటు బాంబుతో దాడి చేశారని పేర్కొంది.

స్థానిక బొగ్గు గనుల్లో భద్రతా పరమైన ఆపరేషన్ నిమిత్తం వెళుతున్న పాక్ దళాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో గాయపడ్డ వారిని హెలికాఫ్టర్‌ ద్వారా మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొంది. బలుచిస్థాన్‌లోని సహజవనరులను పాక్ దళాలు ఎగరేసుకుపోతున్నాయంటూ స్థానికులు ఎంతో కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పాక్ దళాల దుర్నీతిని అడ్డుకునేందుకు వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ బీఎల్ఏ నిత్యం వారిని టార్గెట్ చేసుకుంటూ ఉంటుంది. బీఎల్ఏ దాడుల్లో జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 200 మంది పాక్ సైనికులు మరణించారు.

ఇక మార్చ్‌లో బీఎల్ఏ జరిపిన రైలు హైజాకింగ్ ఉదంతంలో డజన్ల కొద్దీ బీఎల్ఏ వర్గాలు, పాక్ సైనికులు కన్నుమూశారు. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పాక్‌ మిలిటరీకి బలొచిస్థాన్‌తో పాటు ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా, సింధ్ ప్రావిన్స్‌ల్లో కూడా ఎదురుగాలులు వీస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ను బూచిగా చూపించి దేశం మొత్తాన్ని మళ్లీ తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు పాక్ ఆర్మీ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.