క‌ర్రెగుట్ట‌ల్లో 23 మంది మావోయిస్టుల హతం

క‌ర్రెగుట్ట‌ల్లో 23 మంది మావోయిస్టుల హతం

తెలంగాణ – ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటలో నిమగ్నమైన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

కాగా తాజాగా బుధవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కర్రెగుట్ట ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లు సమాచారం.  కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతిమ లక్ష్యంగా జరుగుతున్న ఆపరేషన్ “కగార్” స్వల్ప విరామం తర్వాత తీవ్ర రూపం దాల్చింది.  ప్రస్తుతం జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలోనే మృతి చెందారు అన్న వార్తలు వినవస్తున్నాయి. అయితే డ్రోన్ కెమెరాల‌ స‌హాయంతో మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్టి కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.