ఆపరేషన్ సిందూర్​పై కేబినెట్ ప్రశంసలు

ఆపరేషన్ సిందూర్​పై కేబినెట్ ప్రశంసలు
భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ను కేబినెట్ ప్రశంసించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సేనలు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చడం దేశానికి గర్వకారణమని ప్రధాని కొనియాడారు. 

ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా భారత సేనలు చేపట్టిన చర్యను క్యాబినెట్‌లోని మంత్రులంతా బల్లలు చరిచి సమర్థించారు భద్రతాబలగాలు చేసిన కచ్చితమైన దాడిగా ఆపరేషన్‌ సిందూర్‌ను అభివర్ణించారని సమాచారం. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు కొనియాడారు.

మరోవైపు, కేబినెట్ మీట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని మోదీ కలిశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి వీరు సమావేశం అయ్యారు.  పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించారు. సరిహద్దు వద్ద తాజా పరిస్థితి, ప్రభుత్వ చర్యలను రాష్ట్రపతి ముర్ముకు వివరించారు. . రాష్ట్రపతితో మోదీ సమావేశమైన విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం సోషల్​మీడియాలో వెల్లడించింది. అందుకు సంబంధించిన చిత్రాలను కూడా షేర్ చేసింది. 

పాకిస్తాన్​, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు నిర్వహించిన దాడి గురించి వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజుజు ఆ సమావేశం గురించి ఎక్స్​లో పోస్ట్ చేశారు. “2025 మే 8న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్: జి-074లో ప్రభుత్వం అఖిలపక్ష నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది” అని ఆయన చెప్పారు.

కాగా, ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.