రేవంత్ రెడ్డి చేతకాకపోతే రాజీనామా చేయి!

రేవంత్ రెడ్డి చేతకాకపోతే రాజీనామా చేయి!
అప్పు పుట్టడం లేదని, ఏమీ ఏమీ ఖర్చుపెట్టలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం పట్ల బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విస్మయం వ్యక్తం చేస్తూ  చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు పలికిన ప్రగల్భాలు, ఇచ్చిన హామీలు  నెరవేర్చలేనని భేషరతుగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ చిత్రపటం మీద గొప్పగా వెలుగొందిన తెలంగాణ, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంలోనే అమెరికా వంటి దేశంలో గొప్ప పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయని మండిపడ్డారు.  తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదని, తెలంగాణ పేదరికంలో ముంచబడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ, రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టిన చెరువులతో దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్న అన్నం తినే ప్రాంతంగా వెలుగొందిందని రాజేందర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1969లో ఉద్యమం వచ్చింది `నిధులు మావి.. సొమ్ము మాది.. సోకు మీది అయిందని… ఉద్యోగాలు మావి.. మీరు అనుభవిస్తున్నారంటూ’ అని గుర్తు చేశారు.  
తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నపుడు అనేక సందర్భాల్లో తెలంగాణ స్వయంగా వ్యవసాయ రంగం, మౌలిక వసతుల రంగంలో, ఐటీ రంగంలో అభివృద్ధి చెందిందిగా, తెలంగాణను, హైదరాబాద్ ను మించిందేదీ లేదంటూ ఆనాడు చెప్పమని పేర్కొన్నారు.  తెలంగాణకు 50 శాతం పైబడి ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని చెప్పమని, అలాంటి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిని, పార్టీని దృష్టిలో పెట్టుకుని ఇవాళ దివాళా తీసిందని పదేపదే చెబుతూ ఆయన దివాళాకోరుతనాన్ని బయటపెట్టుకుంటున్నారని రాజేందర్ ధ్వజమెత్తారు.

పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, మాటల్లో, చేతల్లో గంభీరత లేని రేవంత్ రెడ్డి చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాళాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజలను ఎందుకు పనికిరానివారుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్నిఆయన  తీవ్రంగా ఖండించారు.  గత పదేళ్లలో వరి ఉత్పత్తిలో, జీఎస్డీపీ వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని, అనేక రాష్ట్రాల కంటే ఎక్కువ బడ్జెట్ తో ముందుకు సాగిందని రాజేందర్ గుర్తు చేశారు. ఇటీవల భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం రూ. 3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దివాళా తీసిన రాష్ట్రమా అది? అని ప్రశ్నించారు.

మొత్తంగా, 2014లో రాష్ట్ర రెవెన్యూ రూ. 51,000 కోట్లు ఉండగా, 2025 నాటికి అది రూ. 1,56,000 కోట్లకు చేరిందని గుర్తు చేశారు.  ఒకవేళ అప్పుతీసుకునేందుకు ఎల్జిబిలిటీ లేకపోతే, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోతే మరి బ్యాంకుల నుంచి రూ. 64,457 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తెచ్చుకోగలిగింది? అని నిలదీశారు.