
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్‌పై పాకిస్థాన్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. భారత రక్షణ వైబ్‌సైట్లు లక్ష్యంగా పాకిస్తానీ హ్యాకర్లు సైబర్ దాడులు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పాకిస్థానీ హ్యాకర్లు ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో కొన్ని మిలిటరీ వెబ్‌సైట్లు డౌన్ అయ్యాయి. కొన్ని వెబ్‌సైట్లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. భారతీయ రక్షణ దళ అధికారులకు చెందిన సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆఫీసర్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్, పర్సనల్ డిటేల్స్‌ను పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. భారతీయ ఇండియన్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ సంస్థలపై హ్యాకింగ్ చేసి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు వారు పేర్కొన్నట్లు చెప్పాయి. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌ను శాశ్వతంగా క్లోజ్ అయ్యేలా హ్యాకర్లు ప్రయత్నించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
దీంతో వెబ్‌సైట్‌ను క్షుణ్ణంగా ఉద్దేశపూర్వకంగా ఆడిట్ చేయడానికి ఆఫ్‌లైన్‌లో ఉంచినట్లు చెప్పాయి. అదే సమయంలో సైబర్ భద్రతా నిపుణులు, ఏజెన్సీలు చురుకుగా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, డిజిటల్ రక్షణను బలోపేతం చేయడానికి, తదుపరి చొరబాటు ప్రయత్నాల నుంచి రక్షణ కల్పించడానికి అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి. భవిష్యత్తులో సైబర్ బెదిరింపుల వల్ల ఎలాంటి నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి సారించినట్లు వెల్లడించాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్