చిన్మయి కృష్ణదాస్‌ మళ్లీ అరెస్ట్

చిన్మయి కృష్ణదాస్‌ మళ్లీ అరెస్ట్
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రబోధకుడు చిన్మోయ్‌ కృష్ణదాస్‌ను మరోసారి అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీలను రక్షించాలని ఆందోళనలు చేపట్టి దేశ ద్రోహం కేసులో అరెస్టయిన చిన్మోయ్‌ కృష్ణదాస్‌కు ఇటీవలే బెయిల్ లభించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను మళ్లీ పోలీసులు మరో కేసులో అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. గతేడాది నవంబర్ 7న కోర్టు ప్రాంగణంలో న్యాయవాది సైఫుల్‌ ఇస్లాం అలీఫ్‌పై నిరసనకారులు దాడిచేసి, హత్య చేసిన కేసులో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే చిన్మోయ్‌ కృష్ణదాస్‌కు బెయిల్ మంజూరు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వుపై అక్కడి సుప్రీం కోర్టు స్టే విధించినట్లు సమాచారం.  కృష్ణదాస్‌పై నమోదైన కేసులపై వర్చువల్ విచారణ తర్వాత సోమవారం ఆయనను అరెస్ట్‌ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. మిగిలిన కేసులపై మంగళవారం విచారణ జరగనుంది. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌ గతేడాది నవంబరులో చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. 

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు వచ్చాయి. దీంతో నవంబరు 25న ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు ఓ న్యాయవాది ప్రయత్నించగా, ఆయనపై ఆందోళనకారులు దాడి చేశారు. మరో సీనియర్‌ న్యాయవాది కేసును టేకప్‌ చేయగా, ఆయనపైనా కూడా బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో చిన్మయ్‌ కేసును వాదించేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరకు చిన్మయ్‌ భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్‌ జోతే అనే సంస్థ 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది.  ఈ క్రమంలోనే ఆయనకు ఊరట లభించింది. ఇటీవల కృష్ణదాస్​కు బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, తాజాగా మరో కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.

కాగా, షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన దగ్గరి నుంచి భారత్‌- బంగ్లా మధ్య సంబంధాలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ చిన్మయ్‌ కృష్ణదాస్ అరెస్టు కూడా అందుకు ఓ కారణమైంది.