128 ఏళ్ల యోగా గురువు కన్నుమూత

128 ఏళ్ల యోగా గురువు కన్నుమూత
ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) తుదిశ్వాస విడిచారు. వారణాసిలోని నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సన్నిహితులు వెల్లడించారు. శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సహ పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  స్వామి ఆధ్యాత్మిక సాధన, యోగా రంగానికి ఆయన చేసిన అసమానమైన కృషి తరతరాలకు ఆదర్శనీయమని ప్రధాని పేర్కొన్నారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు.
“యోగా సాధకుడు కాశీ నివాసి అయిన శివానంద్‌ బాబాజీ మరణం చాలా బాధాకరం. యోగా సాధనకు అంకితమైన ఆయన జీవితం ప్రతితరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యోగా ద్వారా సమాజానికి సేవ చేసినందుకు ఆయనకు పద్మశ్రీ కూడా లభించింది. ఆయన మరణం.. ఆయన నుంచి ప్రేరణపొందే ఎంతోమందికి మందికి తీరనిలోటు” అని మోదీ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్‌(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించినట్లు వారి శుష్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఆయన బంగాల్​లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచి పెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవ చేశారు. 

శివానంద్ బాబా వారణాసిలోని భేలుపూర్ ప్రాంతంలోని దుర్గాకుండ్‌లో ఉన్న కబీర్ నగర్‌లో నివసించారు. ఆయన ప్రతిరోజూ కూడా క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం చేసేవారు. ఆయన జీవితం బ్రహ్మచర్యానికి అనేక మందికి ఉదాహరణగా నిలిచింది.  అయితే యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద, అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో తెల్లని ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి పురస్కారాన్ని స్వీకరించారు. దీంతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు.