పహల్గాం దాడిపై ఎన్ఐఏప్రాథమిక నివేదిక సిద్ధం

పహల్గాం దాడిపై ఎన్ఐఏప్రాథమిక నివేదిక సిద్ధం
జమ్ముకశ్మీర్ లో ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన ప్రాథమిక నివేదికను అతి త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమర్పించడానికి సన్నాహాలు చేస్తోందని అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్లోని అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన పహల్గాంను చూడడానికి వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు. 

దీని వెనుక ఉన్నది పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని భారత్ భావిస్తోంది. దీనికి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాక్ సైన్యం నుంచి పూర్తి మద్దతు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ సదానంద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ‘పహల్గాం ఉగ్రదాడి నివేదిక’ రూపొందించారు.  దాదాపు 150 మంది సాక్షులు చెప్పిన సాక్ష్యాలు, దాడి జరిగిన రీతిని వివరించే త్రీడీ రీక్రియేషన్, ఘటనా స్థలంలో దొరికిన కాట్రిడ్జెస్, బాలిస్టిక్ విశ్లేషణలు సహా పలు ఆధారాలతో ఈ నివేదిక రూపొందించినట్లు, దీనిని అతిత్వరలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

“ఇది సరిహద్దు అవతల నుంచి సమన్వయంతో, పక్కా ప్రణాళికతో, చాలా జాగ్రత్తగా చేసిన ఉగ్రదాడి. ఉగ్రవాదులు బేతాబ్ లోయలో ముందుగానే ఆయుధాలను మోహరించారు. ఆ ప్రాంతంలోని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (ఓజీడబ్ల్యూ) ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. వారికి నిఘా సమాచారాన్ని కూడా అందించారు'” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

పహల్గాం దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉన్న హ్యాండ్లర్స్ (నిర్వహకుల)తో సంప్రదింపులు కొనసాగించారు. అంతేకాదు ఇప్పటికీ వాళ్లు దక్షిణ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సహకరిస్తున్న జాబితాను ఎన్ఐఏ రూపొంచింది. వారి నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చట్టపరమైన, పరిపాలనా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ ఈ వారం స్వయంగా బైసరన్కు వెళ్లారు. దర్యాప్తు పరోగతి గురించి స్వయంగా పర్యవేక్షించారు. ఎన్ఏఐ బృందాలు ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో మరిన్ని సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తోంది. అలాగే మరింత మంది సాక్ష్యుల నుంచి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రదాడి జరిగిన విధానాన్ని, ఆ సంఘటనల క్రమాన్ని తెలుసుకునేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉగ్రదాడి నుంచి బతికి బయటపడిన వ్యక్తుల వాగ్మూలాలను సేకరించడానికి అదనపు బృందాలను పంపించింది. అలాగే స్థానికులు, కీలక ప్రత్యక్ష సాక్షులను, ఫొటోగ్రాఫర్లను కూడా ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది.

పహల్గాం ఉగ్రదాడులకు పాల్పడినట్లు భావిస్తున్న ముగ్గురు అనుమానితుల స్కెచ్లను అధికారులు విడుదల చేశారు. వారిలో ఇద్దరు పాకిస్థానీయుల కాగా, ఒకరు భారత్లోని అనంత్నాగ్ జిల్లాకు చెందినవాడు. తల్హా భాయ్ (అలీ భాయ్), హషీమ్ ముసా (ఆలియాస్ సులేమాన్) పాక్కు చెందినవారు కాగా, ఆదిల్ హుస్సేన్ థోకర్ స్థానిక ఉగ్రవాది. ఈ ముగ్గురికి లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది.

ఈ ఉగ్రదాడికి సంబంధించి ప్రశ్నించేందుకు కశ్మీర్ లోయలో దాదాపు 2000 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డ్ను పోలీసులు ప్రకటించారు.