అయోధ్య రామమందిరంలో ముస్లిం మహిళ చక్కర్లు

అయోధ్య రామమందిరంలో ముస్లిం మహిళ చక్కర్లు
ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో కలకలం రేగింది. ముఖాన్ని నీలిరంగు వస్త్రంతో కప్పుకొని ఆలయ ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరిగిన ముస్లిం మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ఓ యువకుడు కెమెరా కళ్లద్దాలను ధరించి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తూ దొరికిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం మరికొందరు మహిళలతో కలిసి ఓ ముస్లిం మహిళ అయోధ్య రామమందిరంలోకి ప్రవేశించింది.
ఆమె మొహంపై నీలిరంగు వస్త్రాన్ని కప్పుకుని ఆలయం పరిసరాలన్నీ తిరిగింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి సదరు మహిళపై అనుమానం వచ్చింది. దీంతో ఆలయం నిష్క్రమణ ద్వారం వద్దనున్న భద్రతా సిబ్బందికి సమాచారాన్ని అందించారు.  ఆలయం లోపలి నుంచి బయటి వైపునకు వెళ్లే దాకా ఆమెపై నిఘా పెట్టారు. చివరకు అయోధ్య రామమందిరం నిష్క్రమణ ద్వారం వద్ద సదరు మహిళను భద్రతా సిబ్బంది ఆపారు. అయితే ఆమె వారితో గొడవకు దిగింది. ఎందుకు ఆపుతున్నారని నిలదీసింది.

అదే సమయంలో భద్రతా సిబ్బంది తమ ఉన్నతాధికారులకు కీలక సమాచారాన్ని చేరవేశారు. సదరు మహిళ తీరుపై తమకు అనుమానం ఉందని తెలిపారు. తదుపరిగా ఆమెను రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌కు పంపారు. అక్కడ ఆమెను పోలీసులు ప్రశ్నించి పేరు, చిరునామా, కుటుంబ నేపథ్యం వంటి వివరాలన్నీ సేకరించారు.  అనంతరం ఆ మహిళను మహిళా పోలీస్ స్టేషన్‌‌లో ఉంచారు. తన పేరు ఇరిమ్ అని, మహారాష్ట్ర నుంచి అయోధ్యకు వచ్చానని విచారణలో పోలీసులకు ఆమె తెలిపింది. దీంతో మహారాష్ట్రలోని ఆమె కుటుంబీకులను పోలీసులు సంప్రదించారు. విచారణ నిమిత్తం అయోధ్యకు రావాలని వారిని ఆదేశించారు.

మరోవైపు కెమెరా కళ్లద్దాలను ధరించి ప్రవేశించేందుకు యత్నం ఒక యువకుడు కెమెరా కళ్లద్దాలు ధరించి అయోధ్య రామమందిరం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడి కెమెరా కళ్లద్దాలను భద్రతా సిబ్బంది గుర్తించి ఆపేశారు. విచారణ కోసం అతడిని రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌కు పంపించారు.  అతడిని ప్రశ్నించి ఊరు, పేరు, కుటుంబ నేపథ్యం వంటి వివరాలను సేకరించామని అయోధ్య పోలీస్ స్టేషన్ సీఓ అశుతోష్ తివారీ తెలిపారు. సదరు యువకుడు ఇచ్చిన చిరునామా, పేరు వంటి వివరాలు సరైనవా కాదా అనేది ధ్రువీకరిస్తున్నట్లు చెప్పారు.