మరోసారి సింగపూర్ ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌

మరోసారి సింగపూర్ ప్రధానిగా లారెన్స్‌ వాంగ్‌
ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న సమయంలో సింగర్​పూర్​లో జరిగిన ఎన్నికల్లో అధికార పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) మరోసారి ఘన విజయం సాధించింది. శనివారం అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ నేతృత్వంలో భారీ గెలుపును సొంతం చేసుకుంది. దీంతో ప్రధానిగా మరోసారి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సింగపూర్‌ పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ జరిగింది. 
దాదాపు 26 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ దేశంలో ఓటేయడం తప్పనిసరి. అనంతరం రాత్రి జరిగిన ఓట్ల లెక్కింపులో పీఏపీ తిరుగులేని విజయం సాధించింది.  సింగపుర్ పార్లమెంటులో మొత్తం 98 సీట్లుండగా 5 చోట్ల ఇప్పటికే పీఏపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికలు జరిగిన 93 సీట్లలో 82 చోట్ల ఆ పార్టీ విజయం సాధించి మొత్తం 87సీట్లను గెలుచుకుంది. ప్రతిపక్ష వర్కర్స్‌ పార్టీ 10 సీట్లలో గెలిచింది. 66 ఏళ్లుగా సింగపూర్‌లో పీఏపీనే అధికారంలో కొనసాగుతోంది.

గత ఏడాది సింగపూర్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్‌ వాంగ్‌ (52) తన నేతృత్వంలో జరిగిన తొలి ఎలక్షన్​లో పట్టును నిరూపించుకున్నారు. అమెరికాలో శిక్షణ పొందిన ఈ ఆర్థికవేత్త సింగపుర్ ఆర్థిక మంత్రిగానూ సేవలందిస్తున్నారు.  సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన లారెన్స్​ వాంగ్​కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం కొనసాగించాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. భారత్​, సింగపుర్ మధ్య బలమైన, బహుముఖ భాగస్వామ్యాన్ని పంచుకుంటాయి అని తెలిపారు.