
శ్రీ సత్యసాయి జిల్లాలోని పవిత్ర క్షేత్రం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఆలయ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే భక్తుల్లో ఆందోళన మొదలవుతోంది. ఆక్రమణలతో మురుగుకాలువలు కనుమరుగవడంతో తేలికపాటి వర్షానికే వర్షపునీరు రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తోంది.
అతిపురాతన ఆలయమైన కదిరిశ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆరేళ్ల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వందల ఏళ్ల కిందట వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, వివిధ రాష్ట్రాల నుంచి లక్ష్మీప్రహ్లాద సమేత నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.
ఏటా భక్తుల సమర్పించే కానుకల ద్వారా స్వామి వారికి రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇంతటి వైభవం కలిగిన ఈ ఆలయంలోకి వర్షకాలంలో మురుగునీరు చేరడం భక్తులను కలిచివేస్తోంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామివారి భక్తులు ఆలయ, మున్సిపల్ అధికారులను వేడుకుంటున్న పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“చిన్నపాటి వర్షం వచ్చిన పవిత్ర క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి మురుగునీరు, వ్యర్ధాలు చేరుతున్నాయి. దీంతో భక్తులు అపవిత్రంగా భావిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసిన ఆలయ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదు” అని భక్తులు వాపోతున్నారు.
వందల ఏళ్లనాటి ఆలయంలోకి ఎప్పుడురాని విధంగా గత ఐదారేళ్ల నుంచి వర్షపునీరు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగుకాలువల నిర్వహణపై నిర్లక్ష్యం, ఆదాయంపై మోజుతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలోకి మురుగునీరు రాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు