ప్రతిదానికీ న్యాయస్థానాలను అశ్రయించొద్దు

ప్రతిదానికీ న్యాయస్థానాలను అశ్రయించొద్దు
మధ్యవర్తిత్వాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కోరారు. తద్వారా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలపై భారాన్ని తగ్గించాలని సూచించారు. మధ్యవర్తిత్వమనేది పరిస్థితులను సజావుగా వుండేలా చేస్తుందని, సౌకర్యవంతంగా వుండేందుకు దోహదపడుతుందని, న్యాయం కన్నా ఇది తక్కువేమీ కాదని, పైగా తెలివైన పనని వారు వ్యాఖ్యానించారు. 
 
మీడియేషన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఐఎ) శనివారం నిర్వహించిన మొదటి జాతీయ మధ్యవర్తిత్వ సదస్సులో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. మధ్యవర్తిత్వమనేది భారతదేశంలో దీర్ఘకాలంగా నెలకొన్న సుసంపన్నమైన సాంప్రదాయమని ఆమె చెప్పారు. మన దేశాన్ని పాలించిన వలస పాలకులు ఈ వారసత్వాన్ని నిర్లక్ష్యం చేశారని ఆమె పేర్కొన్నారు.
 
న్యాయంకోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం కన్నా మధ్యవర్తిత్వంతో సమస్యలను, వివాదాలను పరిష్కరించుకోవడం తక్కువేమీ కాదని సిజెఐ సంజీవ్‌ ఖన్నా తెలిపారు. పైగా ఇది అత్యంత వివేచనతో అనుసరించే మార్గమని వ్యాఖ్యానించారు. కోర్టు విచారణలో ఒకరు విజేత కాగా, మరొకరు ఓటమి పొందుతారని చెప్పారు. మధ్యవర్తిత్వాల్లో అటువంటిది వుండదని, దీనివల్ల సంబంధాలు బీటలు వారవని చెప్పారు. మూల కారణాన్ని కనుగొని సమస్యపై మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదని సూచించారు.